పశ్చిమగోదావరి జిల్లాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా అమూల్ పాల సేకరణను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా దీన్ని సీఎం ప్రారంభించారు. పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, అమూల్ ఎండీ ఆర్.ఎస్. సోది, పశ్చిమగోదావరి జిల్లా సహా పలు జిల్లాల నుంచి మహిళలు వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ పాల సేకరణ ఇవాళ ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ పాడి రైతుల కష్టాలు తెలుసుకున్నానన్న సీఎం... లీటర్ పాల కంటే, లీటర్ మినరల్ వాటర్ రేటు ఎక్కువుందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.
రైతుకు వ్యవసాయంతోపాటు... వ్యవసాయ ఆధారిత రంగాల్లోనూ అవకాశం రావాలని, అప్పుడే విలేజ్ ఎకానమీ నిలబడగలుగుతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోకి అమూల్‌ను తీసుకువచ్చామన్నారు. దేశంలోని సహకార రంగాల్లో అమూల్ నెంబర్ వన్‌గా ఉందని, 53 వేల కోట్ల టర్నోవర్ చేస్తోందని వివరించారు. ప్రపంచంలో అమూల్ సంస్థ 8వ స్థానంలో ఉందని, ప్రపంచంతోనే అమూల్ పోటీ పడుతోందని పేర్కొన్నారు. మిగిలిన వారి కంటే చాలా ఎక్కువ ధర ఇచ్చి అమూల్ పాలు సేకరిస్తోందని సీఎం తెలిపారు.
అమూల్‌కు లాభాపేక్ష లేదన్న సీఎం జగన్.. లాభాలన్నింటినీ అక్కచెల్లెమ్మలకు తిరిగి ఇచ్చే ప్రక్రియ అమూల్‌లోనే ఉందన్నారు. సహకార సంస్థ బాగా నడిపితే ఎలా ఉంటుందనేదానికి అమూల్ నిదర్శనమని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. సహకారం రంగాన్ని ప్రైవేటు వ్యక్తులు తీసుకోకపోతే ఎలా బలపడుతుందో చెప్పడానికి అమూల్ మంచి నిదర్శనమన్నారు.
2020 డిసెంబర్లో అమూల్ పాల వెల్లువ ప్రారంభించామన్న సీఎం జగన్.. ఇప్పటివరకు చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 722 గ్రామాల్లో పాల సేకరణ జరుగుతోందన్నారు. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో 153 గ్రామాల్ల పాల సేకరణ ప్రారంభింస్తున్నట్టు వివరించారు. ఈ ఏడాది 2600 గ్రామాల్లో, దశలవారీగా 9899 గ్రామాల్లో పూర్తిగా అమూల్‌ను విస్తరిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖచిత్రం మారబోతోందని వ్యాఖ్యానించారు.
ప్రతి అక్క, చెల్లెమ్మలకు లీటర్ పాలకు 5 నుంచి 15 రూపాయలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని జగన్ తెలిపారు. 13 వేల 739 మంది మహిళా రైతుల వద్ద 52 లక్షల 93 వేల లీటర్లను అమూల్ సేకరించిందన్నారు. ఇప్పటివరకూ పాల సేకరణకింద చేసిన చెల్లింపుల్లో రూ.24,54 కోట్ల రూపాయల్లో రూ.4.6కోట్లు అదనంగా వచ్చిందని... తద్వారా అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా మంచి జరిగిందన్నారు జగన్. పాలుపోసే అక్కచెల్లెమ్మలే అమూల్ సంస్థ వాటాదారులన్న సీఎం.. సహకార సంస్థ బలంగా ఉంటే రైతులకు మరింత మేలు జరుగుతుందని వివరించారు.