పోలవరం గ్రామ రక్షణకు చేపట్టిన నెక్లస్‌బండ్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. రక్షణగా వేసిన రాయి గట్టు పొడవునా కుంగిపోతోంది. రెండేళ్లుగా ప్రాజెక్టు గుత్తేదారులు గట్టు రక్షణ బాధ్యతలను ఆఖరి క్షణంలో చేపడుతున్నారు. వేసవిలో చేపట్టాల్సిన పనులు వరదలు వచ్చిన తరువాత ప్రారంభించి ఉపయోగం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు వరద ఉద్ధృతంగా పెరుగుతుంటే పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా ప్రాజెక్టు నుంచి తీసుకొచ్చిన రాళ్లను నీటిలో వేయడమే గట్టు కుంగిపోవడానికి కారణమని గ్రామస్థులు చెబుతున్నారు.
అనుభవాలు నేర్పినా..
గ్రామానికి రక్షణగా నెక్లస్‌బండ్ నిర్మాణం ప్రారంభించిన తరువాత గ్రామస్థులకు ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. 2006లో నిర్మాణం ప్రారంభించి అరకొర పనులతో సరిపెట్టి గుత్తేదారుడు వెళ్లిపోయాడు. 2015లో మరో గుత్తేదారుడు వచ్చి ఆయన కొంత మేర పని చేసి చేతులు దులిపేసుకున్నారు. అఖండ గోదావరి కుడిగట్టు అధికారుల పర్యవేక్షించాల్సిన పనులను రెండేళ్లుగా ప్రాజెక్టు గుత్తేదారులకు అప్పగించారు. మూడు కిలోమీటర్ల పొడవున నెక్లస్‌బండ్ ఉంది. ఇప్పటి వరకు కిలో మీటరు వరకే కొంత వరకు రాయి తీసుకొచ్చి వేశారు. ఆ రాయి ఎక్కడికక్కడ కుంగిపోతోంది. దిగువ నుంచి పటిష్ఠంగా పనులు చేయాల్సి ఉండగా వరద పెరుగుతున్న సమయంలో రాళ్లు తీసుకొచ్చి, నీటిలో వేయడంతో ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు చెబుతున్నారు. మూడు నెలల కిందట ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ రూ.10 కోట్లకు పైగా నెక్లస్‌బండ్‌కు మంజూరైందని తక్షణం పనులు ప్రారంభిస్తారని చెప్పారు. బండ్‌కు రక్షణ చర్యలతో పాటు గ్రామంలో వర్షపు నీరు వెళ్లేందుకు రెండు చోట్ల నెక్లస్‌బండ్‌కు రెగ్యులేటర్లు నిర్మించాల్సి ఉంది.
గత సంవత్సరం వరదను అడ్డుకునేందుకు అధికారులు కలెక్టరు, ఎస్పీ సహా యంత్రాంగం పోలవరంలో మకాం వేసి అదనంగా ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని రప్పించి ఎంత శ్రమించినా ఆఖరిక్షణంలో నెక్లస్‌బండ్‌కు పెట్టిన తూర నుంచి వరద గ్రామంలోకి కొంత మేర ప్రవేశించింది. తెల్లవారి ఈ ఘటన జరగడంతో అందరూ శ్రమించి ఇసుకబస్తాలు వేసి ముప్పును తప్పించారు. వరదలు తగ్గిన తరువాత తిరిగి నీటిని గోదావరిలోకి తరలించడానికి ఇంజిన్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అటు అధికారులకు ఇటు గ్రామస్థులకు వరదల సమయంలో కంటిపై కునుకు ఉండటం లేదని తక్షణం గట్టు రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రెండేళ్లుగా నిధులు మంజూరు కాకపోవడం పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడానికి కారణమని ఇంజినీర్లు చెబుతున్నారు. దీనిపై ప్రాజెక్టు ఎస్‌ఈ నరసింహమూర్తి మాట్లాడుతూ.. గుత్తేదారులతో ఈ విషయమై మాట్లాడటం జరిగిందని త్వరలో పనులు చేపడతారన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఆ మార్గంలో ప్రత్యేక రైళ్లు రద్దు..