తాడేపల్లిగూడెంలోని నిట్‌లో సాంకేతిక, సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా.. ఏర్పాటు చేసిన ఇస్రో 'స్పేస్ ఆన్ వీల్స్' ఎగ్జిబిషన్ విద్యార్థులను ఎంతగానో అలరించింది. అంతరిక్ష ప్రయోగాలు, ఉపగ్రహాల నిర్మాణం, వాటి పనితీరు, రాకెట్ల ప్రయోగాలు.. ఇలా పలు అంశాలపై రూపొందించిన ప్రదర్శనకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ప్రదర్శనను తిలకించడంతో పాటు.. వారిలోని అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉల్కంజీ ఫెస్ట్ - 2023లో భాగంగా నిర్వహించిన ఇస్రో ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసే ఉద్దేశంతో నిర్వహించిన ఫెస్ట్‌లో ఇస్రో ప్రదర్శనను ఏర్పాటు చేయగా.. వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులను సైతం ఈ ప్రదర్శనకు అనుమతించారు. ఇస్రో ఏర్పాటు.. దాని కార్యకలాపాలు, ఉపగ్రహాలు, రాకెట్ల నిర్మాణం, ప్రయోగాలు, వాటి పరిశీలన.. ఉపగ్రహాల వల్ల దేశానికి కలిగే ప్రయోజనం ఇలా పలు అంశాలను క్షుణ్నంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఉపగ్రహాల పనితీరు, వాటి ప్రయోజనాలు నిట్ విద్యార్థులు వివరించారు.
నిట్‌లో ఏటా నిర్వహించే ఫెస్ట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన చిన్నారులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఇస్రో కలికితురాయిగా చెప్పుకునే పీఎస్ఎల్వీ , జీఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, ఎల్పీవీ లాంటి రాకెట్ల నమూనాలు, వ్యోమగాములు ప్రయాణించే క్యాప్సూల్, ల్యాండర్, రోవర్, ఉపగ్రహాన్ని ఉంచే షీల్డ్.. ఇలా పలు నమూనాలు విద్యార్థులను ప్రత్యేకంగా ఆకర్షించాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించి.. సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో ప్రయోగాలు.. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా తయారుకావాలనుకునే వారికి ఇలాంటి ప్రదర్శనలు ఉపయుక్తంగా ఉంటాయని విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు.