పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం రంగాపురం శివారు గ్రామానికి చెందిన ఓ యువకుడు బెట్టింగ్‌కు బానిసయ్యాడు. రూ.2 లక్షలు అప్పు చేసి బెట్టింగ్‌లు కాశాడు. జేబు ఖాళీ కావడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సమయానికి తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి.
లింగపాలెం మండలం ధర్మాజీగూడెం, లింగపాలెం, రంగాపురం, భోగోలు గ్రామాల కేంద్రంగా ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌కు రూ.25 లక్షల మేర బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, టి.నరసాపురం, కామవరపుకోట, దెందులూరు, విజయరాయి తదితర మెట్ట మండలాల ప్రధాన కూడళ్లలో క్రికెట్ బుకీలు చరవాణుల ద్వారా ఈ దందా సాగిస్తున్నారు. మెట్ట మండలాల్లో రోజుకు రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల మేర బెట్టింగులు జరుగుతున్నట్లు అంచనా.
చేతికి మట్టి అంటకుండా..
బుకీలు తమ చేతికి మట్టి అంటకుండా నూతన విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రధాన బుకీలు తమ కింద ఉండే ఉప బుకీల ద్వారా బోర్డు ఏర్పాటు చేయిస్తున్నారు. ఒక్కో బోర్డుకు ఇద్దరు ఉంటే సరిపోతుంది. వారికి రోజుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ఉంటుంది. మద్యం, బిర్యానీ అందిస్తారు. బుకీలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అంతా గుట్టుగా జరిగిపోతుంది.
జిల్లావ్యాప్తంగా ప్రధాన బుకీలు కనీసం 100 మంది, వారి కింద సబ్ బుకీలు వెయ్యి మంది వరకు ఉంటారని అంచనా. గతంలో మాదిరిగా కంప్యూటర్లు, స్థావరాలు ప్రస్తుతం లేవు. పోలీసులకు దొరక్కుండా కేవలం చరవాణిలో రికార్డింగ్‌ల ఆధారంగా దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు క్రికెట్ బెట్టింగుల తీవ్రత అధికమవుతోంది.