ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Corruption In Sub Registrar Offices: పశ్చిమలో పలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అవినీతి చెద - ap news

Important documents missing in sub registrar offices: పశ్చిమగోదావరి జిల్లాలోని పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులకు సంబంధించిన కీలకమైన దస్త్రాలు మాయమవుతున్నాయి. కొందరు సిబ్బంది అవినీతి, ప్రైవేటు వ్యక్తులు చక్రం తిప్పడం, ఎప్పటికప్పుడు తనిఖీలు లేకపోవడంతో ఈ విధంగా జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దస్త్రాలు తనిఖీ చేస్తున్న అధికారులు
దస్త్రాలు తనిఖీ చేస్తున్న అధికారులు

By

Published : Dec 29, 2021, 8:04 AM IST

Corruption in sub registrar offices: పశ్చిమగోదావరి జిల్లాలోని పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులకు సంబంధించిన కీలకమైన దస్త్రాలు మాయమవుతున్నాయి. సమగ్ర పరిశీలనలో ఇవి వరుసగా వెలుగు చూస్తున్నాయి. కొందరు సిబ్బంది అవినీతి, ప్రైవేటు వ్యక్తులు చక్రం తిప్పడం, ఎప్పటికప్పుడు తనిఖీలు లేకపోవడంతో ఈ విధంగా జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాడేపల్లిగూడెం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 71 వాల్యూముల విలువైన దస్త్రాలు కనిపించడం లేదని గతంలో ఒక సబ్‌ రిజిస్ట్రార్‌ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.

ఇక్కడ 2012 నుంచి కంప్యూటరీకరణ అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్ల సమాచారాన్ని వాల్యూముల్లో భద్రపరిచారు. ఆ రికార్డులు కనిపించకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈ సమాచారం బయటకు రావడంతో... ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు, తిరిగి 13న విజిలెన్స్‌ అధికారులు ఈ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. బుక్‌ 1 (స్థిరాస్తి దస్త్రాల రిజిస్టర్‌), బుక్‌-3 (వీలునామా రిజిస్టర్‌)ల్లోని దాదాపు 80 రకాల దస్త్రాలు మాయమైనట్లు బయటపడింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను పరిశీలించాలని జిల్లా రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్లును స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీ శివరాం ఆదేశించారు.

అందులో భాగంగా ఈ నెల 22న భీమడోలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు దాదాపు 1,650 దస్త్రాలను పరిశీలించారు. ఇందులో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి వివరాలను పొందుపరిచే అతి ముఖ్యమైన దస్త్రాలు, కక్షిదారుల వేలిముద్రలు సేకరించే పుస్తకాలు.. దాదాపు 35 మాయమయ్యాయని గుర్తించారు. దీనిపై అన్ని కోణాల్లో వివరాలను సేకరిస్తున్నారు. తాడేపల్లిగూడెం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పన్నెండేళ్లలో నలుగురు సబ్‌ రిజిస్ట్రార్లు సస్పెండవడం గమనార్హం. ఏళ్లపాటు ఇన్‌ఛార్జిలే ఉంటున్నారు. పూర్తి స్థాయి సబ్‌ రిజిస్ట్రార్‌గా వచ్చిన బీవీవీ సత్యనారాయణ ఇక్కడ పరిస్థితిపై ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే భీమడోలు సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు ముందస్తుగా అధికారులకు సమాచారమిచ్చినట్లు చెబుతున్నారు.

నివేదిక గోప్యం.. ఏమీ చెప్పలేం

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరిగే విజిలెన్స్‌ తనిఖీలపై వివరాలను బహిర్గతం చేయలేం. ఇవి సాధారణంగా జరిగే తనిఖీల్లాంటివి కాదు. విచారణ జరుగుతోంది. నివేదిక ప్రభుత్వానికి ఇస్తాం. - విజిలెన్స్‌ ఎస్పీ వరదరాజులు

రికార్డులు తనిఖీ చేసుకోమని చెప్పాం

జిల్లాలోని రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో విజిలెన్స్‌ తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో మిగతా 25 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ దస్త్రాలను సరిచూసుకోవాలని సబ్‌ రిజిస్ట్రార్‌లకు ఆదేశాలిచ్చాం. తాడేపల్లిగూడెం, భీమడోలు తరహా ఘటనలు జిల్లాలో మరెక్కడా జరిగినట్లు మా దృష్టికి రాలేదు. - స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శివరాం

విజిలెన్స్‌ తనిఖీల్లో అధికారులు గుర్తించిన లోపాలు, అవకతవకలు ఇలా..

  • అనధికార సిబ్బందే మొత్తం కార్య కలాపాలకు చక్రం తిప్పుతున్నారు.
  • రహస్యంగా భద్రపరిచే దస్త్రాల సమాచారం కొంతమంది సిబ్బందికి డబ్బులిస్తే సులువుగా లభిస్తోంది.
  • దస్త్రాలు భద్రపరిచే గదిని సబ్‌రిజిస్ట్రార్‌ పర్యవేక్షణలోనే తెరవాల్సి ఉండగా ఆ గది తాళాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనూ ఉంటున్నాయి
  • గజాల మేరకు జరగాల్సిన కొన్ని రిజిస్ట్రేషన్లు సెంట్ల ప్రకారం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

APPSC Job Notifications: 730 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ABOUT THE AUTHOR

...view details