వివాహేతర సంబంధాలు చివరకు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వెంకటరామన్న గూడెం అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. రామలక్ష్మీ అనే మహిళను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. వెంకట రామన్నగూడెంకు చెందిన మడకం రామలక్ష్మి భర్త రవిని విడిచిపెట్టింది. కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి తెలికిచర్ల వెళ్లే రహదారి పక్కన నివాసముంటుంది. మూడేళ్ల క్రితం స్థానికంగా ఉంటున్న యర్రా సూర్యారావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్ళిన రామలక్ష్మి.. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆమె కుమారులు చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం నుంచి రామలక్ష్మి కోసం గాలింపు చేపట్టగా బుధవారం రామలక్ష్మి ఇంటికి సుమారు 500 మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది. రామలక్ష్మి వేరే వ్యక్తితో సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో సూర్యారావు పథకం ప్రకారం ఆమెను అడవికి తీసుకెళ్లి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.