పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పట్టణాల్లో అనధికారిక భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. పురపాలక సంఘాల్లో భవన నిర్మాణ అనుమతుల నిబంధనలు కఠినతరం కావడం, వివిధ కారణాలతో అధిక శాతం ప్రజలు అనధికారిక నిర్మాణాలపై దృష్టి పెడుతున్నారు. నియంత్రించాల్సిన పట్టణ ప్రణాళికా విభాగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఈ తరుణంలో అనధికారిక భవనాలు, లేఅవుట్లను నియంత్రించేందుకు మున్సిపల్ పరిపాలన శాఖ యూసీఐఎంఎస్ (అనాథరైజ్డ్ కన్‌స్ట్రక్షన్స్ ఐడెంటిఫికేషన్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) యాప్‌ను ప్రారంభించింది. గడచిన కొద్ది నెలలుగా పట్టణాల్లో జరుగుతున్న వ్యక్తిగత, బహుళ అంతస్తుల నిర్మాణాలను పట్టణ ప్రణాళిక విభాగం ఈ యాప్‌లో నమోదు చేస్తోంది.
జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో అనుమతులులేని నిర్మాణాలు ఫిబ్రవరి నాటికి 3,616 జరిగినట్లు గుర్తించారు. వీటిలో ఎక్కువగా వ్యక్తిగత, బహుళ అంతస్తుల భవనాలున్నాయి. అనధికారిక లేఅవుట్లను పట్టణ ప్రణాళిక విభాగం గుర్తించి యూసీఐఎంఎస్‌లో నమోదు చేస్తోంది. జిల్లాలో ఇలాంటి 1,391 అనధికారిక లే అవుట్లు గుర్తించారు. ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఈయూడీఏ) పరిధిలోనే 763 అనధికారిక లే అవుట్లు గుర్తించారు. పట్టణ సచివాలయాల్లోని వార్డు ప్లానింగ్ కార్యదర్శులకు అనుమతులు లేని భవనాలను గుర్తించడమే ప్రధాన విధిగా మారింది. ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకుంటుందా లేదా అపరాధ రుసుములతో క్రమబద్ధీకరిస్తుందా అన్న అంశం తేలాల్సి ఉంది.