ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం అక్రమ రవాణాలో పట్టుబడ్డ ఎస్‌ఈబీ సీఐ, ఎస్​ఐ - పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత

కంచె చేను మేస్తే అన్నచందంగా మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన వారే ఈ అక్రమ రవాణాలో సూత్రధారులయ్యారు. మద్యం అక్రమ రవాణా అడ్డుకోవాల్సిన అధికారులే మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన ఘటన వివరాలివి..!

illegal wine
illegal wine

By

Published : Jul 10, 2020, 8:42 AM IST

పశ్చిమగోదావరి జిల్లా.. చింతలపూడి మండలం లింగగూడెం రాష్ట్ర సరిహద్దు వద్ద వాహనాల తనిఖీల్లో రూ.5 లక్షలు విలువ చేసే 557 తెలంగాణ మద్యం సీసాలను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ అక్రమ రవాణాలో ఎస్​ఈబీ సీఐ, ఎస్సై నిందితులుగా ఉన్నారు. దీనికి సంబంధించి వివరాలను జిల్లా ఎస్పీ నారాయణనాయక్‌ వెల్లడించారు. తెలంగాణలోని సత్తుపల్లి మండలం గంగారం నుంచి రెండు కార్లల్లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

లింగగూడెం చెక్‌పోస్టు వద్ద వేగంగా వెళ్తున్న రెండు కార్లను ఆపి.. తనిఖీ చేశారు. ముందు వెళ్తున్న పైలెట్‌ వాహనంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంటు బ్యూరో స్టేషన్‌ సీఐ పులి హనుశ్రీ, ఆమె డ్రైవర్‌ ఉండగా.. మరో వాహనంలో పశ్చిమగోదావరి జిల్లాలో పని చేస్తున్న ఎస్సై ఎం.విజయ్‌కుమార్‌, ఏలూరుకు చెందిన నున్న కమల్‌సంతోష్‌లు ఉన్నారు. విజయ్‌కుమార్‌ ఉన్న వాహనంలో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. ఈ సమయంలో సీఐ హనుశ్రీ వాహనం నుంచి కిందకు దిగగా.. డ్రైవర్‌ నాగరాజు కారుతో సహా పరారయ్యాడు. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎస్సై విజయ్‌కుమార్​ను సస్పెండ్‌ చేసినట్లు డీఐజీ మోహనరావు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details