జిల్లాలో కార్పొరేట్, సెమీ కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు అన్నీ కలిపి 1125 ఉండగా.. వీటిల్లో 2.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. సుమారు 9 వేల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విలువైన విద్యా సంవత్సరం కోల్పోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్‌లైన్ తరగతులకు శ్రీకారం చుట్టాయి. ప్రభుత్వం కూడా అందుకు అనుమతి ఇచ్చింది. అంతకుముందే జిల్లాలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు తరగతులు నిర్వహించాయి.
ప్రస్తుతం కొందరు కొత్త తరహా వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు.. ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. కొన్ని కార్పొరేట్, సెమీ కార్పొరేట్ విద్యాసంస్థల నిర్వాహకులు విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి ఓ మెలిక కూడా పెట్టారు. పరీక్షలు రాయాలంటే ముందు పుస్తకాలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సందేశాలు పంపుతున్నారు. దానికి ఒక్కో పాఠశాల ఒక్కో రేటును నిర్ధరించింది.