సూర్యారావుపాలెం సహకార సంఘంలో... దాని పరిధిలోని గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో సొమ్మును డిపాజిట్ చేశారు. గత సంవత్సరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పటి వరకు ఉన్న పాలకవర్గాలను రద్దు చేసి ముగ్గురు సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీ ఏర్పాటు చేసే నాటికి సంఘంలో 5 కోట్ల 10 లక్షల రూపాయలు రైతుల డిపాజిట్లు చెల్లించాల్సి ఉండగా.. 89 లక్షల రూపాయలు మాత్రమే బ్యాంకులో ఉన్నాయి.
తాజాగా చేసిన పరిశీలన ప్రకారం నాలుగు కోట్ల 20 లక్షల రూపాయలు రైతుల డిపాజిట్లు చెల్లించాల్సి ఉండగా.. బ్యాంకులో 25 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. తాము డిపాజిట్ చేసిన సొమ్ములు గల్లంతైనట్లు తెలియటంతో రైతులు పెద్ద ఎత్తున సొసైటీ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర కాలంగా డిపాజిట్లు ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.