HIGH COURT FIRES ON COLLECTOR : కొవిడ్ కారణంగా న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయలేకపోయామని పశ్చిమగోదావరి జిల్లా పూర్వ కలెక్టర్, సీఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు తరఫు న్యాయవాది సుభాష్ చెప్పడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. కోర్టు ఆదేశాల అమలుకు కొవిడ్ అడ్డొస్తే.. పంచాయతీ ఎన్నికలు, ప్రభుత్వ అధికార కార్యక్రమాలనెలా నిర్వహించారని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ రికార్డులను తమ ముందుంచాలని ఆదేశించింది.
జనవరి 20న నిర్వహించే తదుపరి విచారణకు అధికారులందరూ హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం పంచాయతీలోని జడ్పీ ఉన్నత పాఠశాల భవనం, స్థలాన్ని ఆక్రమించి వేడుకలు నిర్వహిస్తున్నారంటూ షేక్ సిలార్ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. పాఠశాల స్థలంలో ఆక్రమణలుంటే తొలగించాలని, ప్రహరీ నిర్మించాలని 2020 నవంబరు 3న అప్పటి కలెక్టర్ ముత్యాలరాజు, అధికారులను హైకోర్టు ఆదేశించింది.