పోవలరం ప్రాజెక్ట్ పరిధిలోని వివిధ గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. పునరావాస ప్యాకేజ్ అమలు , పర్యవేక్షణ , నిర్వాసితుల హక్కుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ అఫిడవిట్ వేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథార్టీని ఆదేశించింది . పునరావాసం కల్పించకుండా అక్కడి ప్రజలను ఖాళీ చేయించబోమని గత విచారణలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన హామీని గుర్తుచేసింది . వ్యాజ్యంపై తదుపరి విచారణను ఆగస్టు 23 కు వాయిదా వేసింది .హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం శనివారం ఈమేరకు ఆదేశాలిచ్చింది .
పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో వివిధ గ్రామాల గిరిజన నిర్వాసితులను అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని పేర్కొంటూ ' శక్తి ' స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డాక్టర్ పి.శివరామకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు . పిటిషనర్ తరఫు న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ .. అధికారులు కాపర్ డ్యామ్ వద్ద నీటిని నిల్వ ఉంచి... గ్రామాలు నీట మునిగేలా చేస్తున్నారన్నారు . ఫలితంగా అక్కడి ప్రజలు ఖాళీ చేసి వెళ్లాళ్సిన పరిస్థితులు కల్పిస్తున్నారన్నారు . పూర్తి స్థాయిలో పునరావాసం ఏర్పాట్లు చేయకుండా గిరిజనులను ఖాళీ చేయిస్తున్నారన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు.