రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏకధాటిగా కురిన వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందల ఎకరాల్లో నారుమళ్లు నీటమునిగాయి. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేసిన లేఅవుట్‌ల్లోకీ నీరు చేరింది. పలుచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. ఏజెన్సీ, మెట్టమండలాల్లో కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పొంగుటూరు వద్ద శ్రీ రామకట్ట చెరువుకు గండి పడటంతో రోడ్లపైకి నీరు చేరి వాహనాలు నిలిచిపోయాయి. చెరువునీటిలో చేపలు పట్టేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు. రాకపోకలు స్తంభించి ప్రజలు ఇబ్బంది పడ్డారు.
కర్నూలు జిల్లాలో పలోచోట్ల మూడు గంటలకుపైగా వర్షం కురిసింది. ఉదయం 4 గంటల నుంచి కురిసిన వర్షానికి రహదారులు... చెరువులను తలపించాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నంద్యాలలో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. కాలువల్లో మురుగునీరు నిలిచిపోయి పురపాలక సంఘం కార్యాలయం ముందు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. నల్లమల కొండల్లో వర్షపు జల్లులతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాలు ఆహ్లాదరకరంగా మారాయి. వర్షాణ్ని సైతం లెక్కచేయకుండా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.