ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలతో అతలాకుతలం.. భయాందోళనలో ప్రజలు - water streams Huge Flow Latest News

పశ్చిమ గోదావరి జిల్లాలో వాయుగుండం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో సగటున 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు, తణుకు, ఆకివీడు, తాడేపల్లిగూడెం లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. ఏలూరు నగరంలో ఆర్టీసీ డిపో, కలెక్టరేట్, ఆర్ఎం కార్యాలయాల్లోకి భారీగా నీరుచేరింది. ఏలూరు ఆర్టీసీ డిపోలో మూడు అడుగల మేర నీరు నిలవడం వల్ల సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భారీ వర్షాలతో అతలాకుతలం.. భయాందోళనలో ప్రజలు
భారీ వర్షాలతో అతలాకుతలం.. భయాందోళనలో ప్రజలు

By

Published : Oct 13, 2020, 7:09 PM IST

Updated : Oct 13, 2020, 9:24 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం పోలవరం కొయ్యలగూడెం జీలుగుమిల్లి గోపాలపురం తదితర మండలాల్లో వాగులు వంకలు ప్రమాదకరస్థాయిలో పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో ఉన్న ఐదు జలాశయాలకు భారీగా వరద నీరు చేరడం వల్ల గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

జంగారెడ్డిగూడెంలో..

జంగారెడ్డిగూడెంలో ఎర్ర కాలువ జలాశయం నుంచి నాలుగు గేట్లు ద్వారా 15 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. మరో వైపు శుద్ధ వాగు వద్ద వరద ఉద్ధృతంగా కొనసాగుతోంది.

భారీ ప్రవాహంతో..

బుట్టాయగూడెం, టి.నర్సాపురం, తడికలపూడి, కొయ్యలగూడెం, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం మండలాల్లో వాగులు భారీ ప్రవాహంతో ఉన్నాయి. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టేన్నపాలెంలో జల్లేరు వాగు పొంగి ప్రవహిస్తోంది.

జైహింద్, సుద్దవాగు, బైనేరు వాగులు ఎర్రకాలువ ప్రమాద స్థాయిలో పొంగుతున్నాయి. కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయం, కొవ్వాడ, గుబ్బలమంగమ్మ జల్లేరు, జలాశయాలు గేట్లు ఎత్తివేశారు. ఎర్రకాలువ జలాశయం నుంచి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోపాలపురం పోలవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో వేల ఎకరాల్లో వరి, పొగాకు నారుమళ్లు దెబ్బతిన్నాయి. తడికలపూడిలో చేపల వేటకు వెళ్లి వాగులో పడి మత్స్యకారుడు గల్లంతయ్యారు.

భారీ వర్షాలతో పగో అతలాకుతలం.. ఉద్ధృతంగా వాగులు

తాడేపల్లిగూడెంలో..

తాడేపల్లిగూడెం నల్లజర్ల పోతవరం గ్రామాల్లో వేలాది ఎకరాలు ఎర్ర కాలువ ధాటికి నీటమునిగాయి. పలు చోట్ల ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులపై ప్రజలు సాహసోపేత ప్రయాణాలు చేస్తున్నారు.

జిల్లాలోని మన్యం మండలాల్లో పంట నష్టం తీవ్ర రూపం దాల్చింది. ప్రధానంగా కుక్కునూరు వేలేరుపాడు జీలుగుమిల్లి బుట్టాయిగూడెం పోలవరం మండలాల్లో అన్ని రకాల పంటలు కుదేలయ్యాయి. వరి పంట గింజల దశకు చేరుకోవడంతో నీట మునిగి పాడైపోయింది. చెరకు వేరుశెనగ మొక్కజొన్న తదితర పంటలకు భారీ వానలు నష్టాన్ని కలిగించాయి. ఆయా పంట పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో పొగాకు రైతులు మరిన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు.

తమ్మిలేరు ప్రవాహ జోరు..

తమ్మిలేరు జోరుగా ప్రవహిస్తుండటం వల్ల నగర వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ్మిలేరు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీతో అప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఇప్పటికే శనివారంపేట శ్రీపర్రు వద్ద ఉన్న కాజ్​వేలు మీదుగా వరద నీరు భారీగా ప్రవహించడంతో ఆయా ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి.

నరసాపురం పట్టణంలో..

నరసాపురం పట్టణంలోని పలు కాలనీలు నీట మునగడంతో పాటు డ్రైనేజీలు పొంగి రహదారిపైకి మురుగు నీరు చేరింది. రొయ్యల చెరువులు నీట మునగడంతో గట్లు గండ్లు పడ్డాయి. ఫలితంగా రైతులు గట్టు కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టారు. అయినా ఆశించిన ప్రయోజనం లేకపోవడంతో రొయ్యలు పట్టారు. చాలా చోట్ల గట్లు కలిసిపోవడంతో ఆక్వా రైతులు నష్టపోయారు. ఉప్పు రాశులు నీటమునిగాయి. ఉద్యానవన పంటలు సైతం దెబ్బతిన్నాయి. జిల్లాలోని సముద్ర తీరంలో ఈదురు గాలులతో అలల తాకిడి తీవ్రంగా ఉంది.

ద్వారకా తిరుమల శ్రీవారి వద్ద..

ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీవారి చిన్న వెంకన్న పుష్కరిణి నరసిహసాగరానికి వరద నీరు భారీగా చేరడంతో గండి పడింది. ఈ క్రమంలో ఓ యువకుడు నది దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు వరదలో కొట్టుకుపోయాడు. కొంచెం దూరం కొట్టుకుపోయిన అనంతరం బాధితుడికి వరద నీటిలో ఓ స్తంభం తగిలింది. దాని సాయంతో వరద నీటిలో నుంచి సురక్షితంగా బయటపడగాలిగాడు.

భారీ వర్షాలతో పగో అతలాకుతలం..భయాందోళనలో ప్రజలు

వాయుగుండం వల్ల..

వాయుగుండం ప్రభావంతో 24 గంటలుగా ఎడ తెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఉండ్రాజవరం మండల పరిసర ప్రాంతాల్లో పంటలు పాక్షికంగా నీట మునిగాయి. వివిధ చోట్ల వరి పాక్షికంగా నేల వాలింది.

అధికశాతం పంటలు వర్షార్పణం..

తణుకు ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో అధికశాతం పండించే వరి.. మెట్ట భూముల్లోని అరటి వాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు నేలరాలాయి. ఫలితంగా రైతులు బెంబేలెత్తిపోతున్నారు.

మదనగోపాల స్వామి సన్నిధికి వరద..

అత్తిలి మండలం బల్లిపాడులోని మదన గోపాల స్వామి ఆలయం నీటమునిగింది. భారీగా నీరు చేరడంతో స్వామివారి దర్శనానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దేవాలయ ప్రాంగణం, ఆలయంలోపలతో పాటు గర్భగుడిలోకి వర్షపు నీరు ప్రవేశించి స్వామి వారి విగ్రహం వద్దకు చేరింది. మోకాళ్ల లోతు వర్షపు నీటిలోనే అర్చకులు పూజాదికాలు నిర్వహిస్తున్నారు.

భారీ వర్షాలతో అతలాకుతలం.. భయాందోళనలో ప్రజలు

ఇవీ చూడండి : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు

Last Updated : Oct 13, 2020, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details