ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా... తమ్మిలేరు, శ్రీశైలం, సోమశిల జలాశయాలకు భారీగా వరదలు వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు జలాశయం ఇన్‌ఫ్లో 6,500 క్యూసెక్కులు కాగా... ఔట్‌ఫ్లో 4 వేల క్యూసెక్కులుగా ఉంది. సోమశిలకు ఎగువ నుంచి 22,792 క్యూసెక్కులు వరద వస్తోంది. జలాశయం పూర్తి నీటిమట్టం 77.988 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటిమట్టం 70.299 టీఎంసీలుగా ఉంది. వరద ఉద్ధృతి ఇలాగే కొనసాగితే... ఏ సమయంలోనైనా అధికారులు నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. ముందస్తు చర్యల్లో భాగంగా పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..
శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1,31,833 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం ఎడమగట్టు ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి ద్వారా 34,255 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులుకాగా... ప్రస్తుత నీటిమట్టం 874.50 అడుగులుగా ఉంది. అలాగే పూర్తి నీటినిల్వ 215.807 టీఎంసీలుగా ఉండగా... ప్రస్తుత నీటినిల్వ 161.2918 టీఎంసీలుగా ఉంది.