పోలవరానికి పోటెత్తుతున్న వరద గోదావరికి వరద ప్రవాహం ఎక్కువ కావడంతో.. ముంపు మండలాలను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ఎగువున కురుస్తున్న వర్షాలకు పోలవరానికి భారీ స్థాయిలో వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో గోదావరి వరద చేరుతోంది. స్పిల్ వే వద్ద 32.8మీటర్ల వద్ద వరద ప్రవాహం ఉంది. కాఫర్ డ్యామ్ వద్ద 34.3 మీటర్లకు నీటి ప్రవాహం చేరింది. పోలవరం బోట్ పాయింట్ వద్ద 23.6 మీటర్ల వద్ద నీరుంది. స్పిల్ వే 48 గేట్ల ద్వారా 8.6 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు.
నదిలోకి అస్సలు వెళ్లొద్దు..!
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కన్నబాబు కోరారు. బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని..నదిలో చేపల వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ముంపు మండలాల అప్రమత్తత..
పోలవరం ముంపు గ్రామాలను గోదావరి నీరు ముంచెత్తుతోంది. కొద్దిపాటి వరదకే ప్రాజెక్టు ఎగువన ఉన్న అనేక గ్రామాలు మునిగిపోతున్నాయి. గోదావరికి అడ్డుగా నిర్మించిన ఎగువ కాఫర్‌డ్యాం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో 15 గ్రామాలు, పోలవరం మండలంలో 12 గ్రామాలను నీరు ముంచెత్తింది. అనేక ఊళ్లు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. పోలవరం ఏజెన్సీలో ముంపు బాధిత గ్రామాలవారు ఎత్తయిన ప్రాంతాల్లో కొండలపై సొంతంగా ఏర్పాటు చేసుకున్న గుడిసెల్లో ఆశ్రయం పొందుతున్నారు.
ఇప్పుడే ఇలా ఉంటే..ఆగస్టు నాటికి ఎలానో!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరికి అడ్డుగా 38 మీటర్ల ఎత్తున కాఫర్‌డ్యాం నిర్మించారు. దీన్ని 41.15 మీటర్ల ఎత్తున నిర్మించాల్సి ఉంది. గతేడాది వరదల సమయంలో కాఫర్‌డ్యాం వద్ద ఆగస్టు 24న అత్యంత వరద వచ్చినప్పుడు 28.4 మీటర్ల ఎత్తున నీరు నిలిచింది. గతేడాది గోదావరి గరిష్ఠ వరద సుమారు 23 లక్షల క్యూసెక్కులు. ఆ సమయంలో కాఫర్‌డ్యాంకు అటూఇటూ కూడా నీరు దిగువకు వదిలేందుకు దాదాపు 600 మీటర్లపైన ఖాళీ ఉంచారు. ఈసారి పూర్తి అడ్డుకట్ట ఏర్పడింది. ప్రస్తుతం పోలవరం వద్ద 6.63 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వస్తోంది. స్పిల్‌వే గేట్లన్నింటినీ ఎత్తి వరదను యథాతథంగా దిగువకు వదులుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాఫర్‌డ్యాం వద్ద 32.9 మీటర్ల మేర నీటిమట్టం ఏర్పడింది. గోదావరిలో 6.63 లక్షల క్యూసెక్కుల ప్రవాహం పెద్ద వరదగా పరిగణించరు. ప్రస్తుత వరదకే ఇలా ఉంటే కొద్ది రోజుల్లో ఆగస్టులో వచ్చే వరద నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం వెంటాడుతోంది.
ఇదీ చూడండి.floods: గోదావరికి వరద ఉద్ధృతి ..విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికలు