ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమ గోదావరిని వదలని వాన.. నీట మునిగిన పొలాలు - పశ్చిమగోదావరి జిల్లా నేటి వార్తలు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లాలోని అనేక గ్రామాలు నీటి వరదలో చిక్కుకున్నాయి. భారీ వానకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు కాలవలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఎకరాల పంటలు నీట మునిగాయి.

heavy crop damaged with rains in west godavari district
పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు... నీట మునిగిన పంటపొలాలు

By

Published : Oct 14, 2020, 6:08 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాను వానలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో కాల్వలు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. జిల్లాలో సగటున 13 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరంలో 20 సెంటీ మీటర్లు వర్షపాతం,జిల్లాలోని 11 మండలాల్లో 15 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. తమ్మిలేరు, ఎర్రకాలువ, కొవ్వాడ, జల్లేరు జలాశయాల్లోకి వరదనీరు భారీగా చేరింది.

వానలకు ఏలూరు తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద చేరుతోంది. ఎర్రకాలువ జలాశయం నుంచి 22 వేల క్యూసెక్కులు, తమ్మిలేరు జలాశయం నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఏలూరు పట్టణంలోని పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. ఏలూరు రెండోపట్టణ ప్రాంతంలోని వైఎస్‌ఆర్‌ కాలనీ, మాదేపల్లి, శ్రీపర్రు కాలనీలో వరదనీరు ప్రవహిస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు... నీట మునిగిన పంటపొలాలు

విస్తారంగా కురుస్తున్న వానలకు జిల్లాలోని గుండేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దెందులూరు మండలంలోని సత్యనారాయణపురాన్ని వరద నీరు చుట్టుముట్టింది. సుమారు 500 ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు పెరగడంతో సత్యనారాయణపురం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు జిల్లాలోని అన్ని రకాల పంటలు నీట మునిగి.. అన్నదాతలను కోలుకులేని దెబ్బ తీశాయి.

ఇదీ చదవండి:

పులిచింతలకు భారీగా వరద..18 గేట్లు ఎత్తి నీరు విడుదల

ABOUT THE AUTHOR

...view details