విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు పిల్లలపై వేధింపులు దిగడంతో తట్టుకోలేక పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా ఉపాధ్యాయులు తరుపు మాట్లాడేసరికి చేసేది లేక విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారు. ఒక్కసారిగా 100 మంది విద్యార్థులను బస్టాండ్ లో చూసిన పోలీసులు అవాక్కయ్యారు. విషయాన్ని ఆరా తీయగా ప్రిన్సిపల్, ఇద్దరు ఉపాధ్యాయులు వేధిస్తున్నారని.. వీటిని తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోతున్నామని అని చెప్పడంతో.. అధికార యంత్రాంగం స్పందించింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చోటు చేసుకుంది.
మండలంలోని ఎల్బీ చర్ల బాలుర గురుకుల పాఠశాలలో 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత కొంత కాలంగా ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థులను ఏదో ఒక సాకు చూపించి.. బెదిరించడం,కొట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని విద్యార్థులు వాపోయారు. వీటిని తట్టుకోలేక.. చదువులు మాని ఇళ్లకు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్కూల్ నుంచి 100 మంది విద్యార్థులు నర్సాపురం ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో రోడ్డు మీద విధుల్లో ఉన్న పోలీసులు విద్యార్థులను ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.