గోదావరి వరద వల్ల పశ్చిమగోదావరి జిల్లాలో పలు పంటలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. వేలాది హెక్టార్లలో వరిపొలాలు, పత్తి, మిరప, ఉద్యాన, కూరగాయల పంటలు నీటమునిగాయి. మెట్ట ప్రాంతాలు, లంక గ్రామాల్లో పంటనష్టం తీవ్రంగా నమోదైంది. కుండపోతగా కురిసిన వర్షాలతో వారం రోజులపాటు గోదావరి తీవ్రరూపం దాల్చింది. గోదావరిలో వరద కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పలు మండలాలు వరద తాకిడికి గురయ్యాయి. జిల్లాలో సుమారు 18 మండలాల్లో వరదలు, వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖల ప్రాథమిక అంచనా మేరకు ఐదు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ అంచనా నాలుగింతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నీటిలో ఉన్న పంటలను అధికారులు గుర్తించడం లేదని రైతులు వాపోతున్నారు. సుమారు 25 వేల హెక్టార్లలో పంటనష్టం ఉండే ఆస్కారం ఉందని రైతులు చెబుతున్నారు.
ముంపు గ్రామాలను ముంచెత్తిన వరద
జిల్లాలోని మెట్ట ప్రాంతమైన వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల్లో సుమారు 52 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షాధారం కింద సాగుచేసిన వరి, పత్తి, మిరప పంటలను వరద ముంచెత్తింది. ముంపు మండలాల్లోని పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. సాధారణంగా భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తేనే ముంపు మండలాల్లో పంటలు నీటమునిగేవి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మించిన ఎగువ కాఫర్ డ్యామ్ వల్ల గ్రామాలను వరద ముంచెత్తింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాకముందే.. వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాలను గోదావరి వరద ముంచేసింది. ఈ మూడు మండలాల్లోనే 20 వేల ఎకరాల పత్తి, మిరప చేలు వరదనీటిలో మునిగాయి. మెట్టప్రాంతంలో వర్షాధారం కింద.. అధికంగా రైతులు పత్తి సాగు చేస్తారు. సాగు చేసిన నెలరోజులు కాకమునుపే పంటకు నష్టం వాటిల్లింది.
90 శాతం మేర నీట మునిగిన పంటలు