గత ఏడాది గోదావరికి వరద పోటెత్తింది.. జులై నెల నుంచే వరద ప్రారంభమై.. నెలరోజుల పాటు.. ముంపు గ్రామాల ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేసింది. అధికార యంత్రాగం సహాయ చర్యలు చేపట్టడంతో కొంతవరకు ముంపు గ్రామాలకు ముప్పుతప్పింది. లాంచీలు, పునరావాస కేంద్రాలు, వైద్య సదుపాయాలు, ఆహార సరఫరా వంటి అనేక సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఏడాది మాత్రం అలాంటి ఏర్పాట్లు మచ్చుకైనా కనిపించడంలేదు.
సమీక్షలు లేవు....
పశ్చిమగోదావరి జిల్లాలో కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేదు. అత్యవసర రవాణాకు అవసరమైన లాంచీలు సైతం ఈ సారి సమకూర్చలేదు. వరద ముప్పును ఎదుర్కొనేందుకు యంత్రాగాన్ని సన్నద్ధం చేసే కనీస సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు. కొవిడ్-19 ప్రభావం వల్లే సమీక్ష సమావేశాలు నిర్వహించడం లేదని అధికారులు అంటున్నారు.
ముందే చేరేవి..
ఆయా గ్రామాల్లో కనీస సహాయ చర్యలపైన అధికారులు దృష్టి సారించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోదావరికి వరద వస్తే.. జిల్లాలోని పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటాయి. బాహ్యప్రపంచంతో వారికి సంబంధాలు తెగిపోతాయి. నిత్యావసరాలు, కూరగాయాలు, వైద్యం వంటివి సదుపాయాలు కరవవుతాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు లాంచీలు అవసరం అవుతాయి. గతంలో గోదావరికి వరద వచ్చే ముందే లాంచీలు ఆయా గ్రామాలకు చేరేవి.
నిబంధనలు కఠినతరం...
ఉభయగోదావరి జిల్లాలోని ముంపు గ్రామాలకు 30వరకు లాంచీలు అవసరం అవుతాయి. గత ఏడాది తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద లాంచీ మునిగిన ఘటనతో సరంగుల నిబంధనలు కఠినతరం చేశారు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించి.. 60ఏళ్ల లోపు ఉన్నవారే లాంచీలు నడపాలని నిబంధనలు తీసుకొచ్చారు. ఈ కారణంగా లాంచీలు నడిపేందుకు సరంగుల కొరత ఏర్పడుతోంది. తాత్కాలికంగా సరంగులను రమ్మంటున్నా.. వారు రావడంలేదు. తమకు పూర్తిగా లాంచీలు నడిపే అనుమతి ఇస్తేనే వరద సమయంలో వస్తామని అంటున్నారు.
ఇదీ చదవండి
పవన్ కల్యాణ్‌ను కలిసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు