పశ్చిమగోదావరి జిల్లాలో..
సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఉండ్రాజవరంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత స్వామి ఆలయంలో భక్తుల తాకిడితో రద్దీగా మారింది. సుబ్రహ్మణ్య షష్టి రోజున స్వామివారిని దర్శించుకుంటే సర్వాభిష్టాలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన అరటి పండ్లను నైవేద్యంగా పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో స్వామివారికి దీపారాధనలు చేశారు. ఆలయం లోపల పుట్ట వద్ద భక్తులు పాలు, గుడ్లు వేసి పూజలు చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేలా.. దేవస్థానం పాలక వర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
తూర్పుగోదావరి జిల్లాలో..
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకొని స్వామి వారి ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. అమలాపురంతో పాటు కోనసీమ వ్యాప్తంగా వివిధ గ్రామాలలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తజనం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.