Ganja Sellers Arrest : పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా గంజాయి మత్తు పదార్థాల అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అడుగడుగునా జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహిస్తూ.. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాలు, అమ్మకాలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేసి దాడులు చేస్తున్నారు. తాజాగా తణుకు పట్టణ పరిధిలో గంజాయి అమ్ముతున్న ఒక బాలుడితో పాటు మరో ఇద్దరిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను, గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణా, అమ్మకాల నిరోధానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారో జిల్లా ఎస్పీ యు. రవి ప్రకాష్ మీడియాకు వివరించారు.
పట్టణ పరిధిలోని జపాన్ కాలనీ శివారు ఖాళీ స్థలంలో ఇద్దరు యువకులు, బాలుడు ప్లాస్టిక్ సంచులతో ఉన్నారనే సమాచారం రావడంతో తణుకు గ్రామీణ సీఐ ఆంజనేయులు, గ్రామీణ ఎస్సై రుద్రయ్య, సిబ్బంది వెళ్లారు. పోలీసులను గమనించి ముగ్గురూ ప్లాస్టిక్ సంచులతో సహా ద్విచక్రవాహనంపై పరారయ్యేందుకు ప్రయత్నించారు. సీఐ, ఎస్ఐ, సిబ్బంది వారిని అడ్డుకుని అదుపులోనికి తీసుకొని.. వారి వద్ద సంచులను పరిశీలించగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. తణుకు పట్టణానికి చెందిన తరుణ్ కుమార్, శ్యామ్ సింగ రాయ్ అనే ఇద్దరు మరో బాలుడు గత కొంతకాలంగా గంజాయి అమ్ముతున్నట్లు వెల్లడైంది. విశాఖపట్నం జిల్లా అరకు నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేసి తీసుకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి 22 కిలోల గంజాయి ఒక ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.