విభజన చట్టంలో జాతీయ హోదా కల్పించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, మేధావులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్‌ను కలిసిన ఆయా పార్టీలు, సంఘాల ప్రతినిధులు... ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. కేంద్రం వైఖరి మార్చుకోకపోతే పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా ఉద్యమిస్తారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా బేషజాలకు పోకుండా తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అందరినీ కలుపుకొనిపోయి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అథారిటీ ఛైర్మన్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఉన్నారు.