Fake Currency Gang Arrest: పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురంలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. పోలీసులు వీరి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు, ఎర్టిగా కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన నరసాపురం డీఎస్పీ మనోహరాచారి వివరాలు వెల్లడించారు.
నరసాపురానికి చెందిన వీఆర్వో ముత్యాల పెద్దిరాజు చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. దీంతో ముత్యాల పెద్దిరాజు తన మిత్రుడైన పరుచూరి భాస్కర్ రావుతో కలిపి దొంగనోట్లు చలామణి చేయాలని ప్లాన్ చేశాడు. విజయవాడ, రాజమండ్రి కేంద్రంగా దొంగ నోట్లు చలామణి చేసే ఒక వ్యక్తిని కలిసి అతని వద్ద నుండి 50 వేల దొంగ నోట్లు తీసుకొచ్చి బ్యాంకు డిపాజిట్ మిషన్ ద్వారా తమ ఖాతాలలో జమ చేయడం మొదలుపెట్టారు.
దీనిలో భాగంగా ఫిబ్రవరి 7 తారీఖున ముత్యాల పెద్దిరాజు కుమారుడు కల్యాణ్ బాబు 40 ఐదు వందల నోట్లు డిపాజిట్ మిషన్‌లో జమ చేశారు. అనంతరం బ్యాంకు సిబ్బంది డిపాజిట్ మిషన్‌లోని నగదును దొంగనోట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీఆర్వో పెద్దిరాజును, డిపాజిట్ చేసిన అతని కుమారుడు కల్యాణ్ బాబులను అదుపులో తీసుకుని విచారించగా.. వీరితోపాటు దొంగనోట్లు చలామణితో సంబంధం ఉన్న నరసాపురానికి చెందిన పరుచూరి భాస్కరరావు, రాజన్నపేటకు చెందిన తేలు పుష్పాంజలిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
దొంగనోట్లు చాలామణిలో కీలక సూత్రధారిగా రాజమండ్రికి చెందిన వ్యక్తి పరారీలో ఉన్నాడని.. అతనిని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. అలాగే ఈ కేసులో సంబంధం ఉన్న మరి కొంతమందిని అరెస్ట్ చేయవలసి ఉందని డీఎస్పీ మనోహరాచారి మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి :