పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో దొంగనోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక వైఎస్సార్ కాలనీకి చెందిన కర్రి సత్యనారాయణ చెడు వ్యసనాలకు బానిసై అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతను యూట్యూబ్‌ను వేదికగా చేసుకుని దొంగనోట్లు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాడు. అతనికి గ్రామానికి చెందిన మానేపల్లి దుర్గాప్రసాద్, యర్రంశెట్టి శ్రీకాంత్, పైడిరాజు జత కలిశారు.
వీళ్లందరూ కలిసి ప్రింటర్లు కొనుగోలు చేసి అసలు కరెన్సీతో కలర్ జిరాక్స్‌లు తీసి నకిలీ నోట్లు తయారు చేసేవారు. ఈ కరెన్సీని చుట్టుపక్కల గ్రామాల్లో కొద్దికొద్దిగా మార్చి ఆ డబ్బుతో జల్సా చేసుకునేవారని డీఎస్పీ తెలిపారు. పక్కా సమాచారంతో సీఐ డేగల భవానీ ప్రసాద్.. తనిఖీలు చేసి దొంగనోట్లు తయారు చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు కలర్ ప్రింటర్లు, రూ.1,49,200 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.