హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందారు. నలుగురు యువకులు అక్కడికక్కడే మరణించగా... మరొకరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో గచ్చిబౌలి నుంచి గౌలిదొడ్డికి వెళ్తున్న స్విఫ్ట్ కారు సిగ్నల్ జంప్ చేసింది. అదే సమయంలో గ్రీన్ సిగ్నల్ పడి వస్తున్న టిప్పర్.. ఆ కారును ఢీ కొట్టింది.
మృతుల్లో కాట్రగడ్డ సంతోష్ (25), చింతా మోహన్ (22), భరద్వాజ (20), రోషన్, పవన్ ఉన్నారు. వీరందరూ మెన్స్ హాస్టల్లో ఉంటున్నారు. సంతోష్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయిగూడెం. కొల్లూరు పవన్‌కుమార్, నాగిశెట్టి రోషన్ నెల్లూరు చెందిన వారు కాగా పప్పు భరద్వాజ్ విజయవాడ అజిత్ సింగ్‌నగర్ వాసి. చింతా మనోహర్ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. సంతోష్ టెక్ మహీంద్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.