ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదారి... ఈసారీ ముంపుదారి! - పశ్చిమగోదావరి లచ్చిగూడెంలో వరద ఇబ్బందులు

గోదావరి వరద నీటిలో వెళ్లి తాగునీటిని బిందెలతో తెచ్చుకుంటున్న దైన్యస్థితి వీరిది. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపులో చిక్కుకునే లచ్చిగూడెం గ్రామవాసుల ఇక్కట్లు అన్ని ఇన్నీ కావు. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో ఈ ఊరుంది. ఇదొక్కటే కాదు.. పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలు వరద ముంపులో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

floods in west godavari district
వరద నీటిలో వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్న స్థానికులు

By

Published : Jul 13, 2020, 8:25 AM IST

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాంను 31 మీటర్ల ఎత్తు నిర్మించడంతో కిందటి ఏడాది గోదావరి వరద వెనక్కు ఎగదన్నింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని 6 మండలాల్లో ఏజెన్సీ గ్రామాలవారు ఇబ్బందుల పాలయ్యారు. 30 రోజులకు పైగా వరద నీరు, ముంపులో చిక్కుకున్న గ్రామాలు చాలానే ఉన్నాయి. గడిచిన ఏడాదిగా ఈ గ్రామాల పునరావాసానికి చర్యలు చేపట్టింది లేదు... ఖాళీ చేయించిందీ లేదు. ప్రస్తుతం మళ్లీ గోదావరికి వరద పెరుగుతోంది. జులై మూడో వారం నుంచి ఆగస్టు వరకు గోదావరికి లక్షల క్యూసెక్కుల్లో వరద ప్రవాహాలు రానున్నాయి. ఈ పరిణామంతో గిరిజన గ్రామాల వారు భయపడుతున్నారు.

107 గ్రామాలు...
పోలవరం డ్యాం 41.15 మీటర్ల ఎత్తున నిర్మితమైతే ఉభయ గోదావరి జిల్లాల్లోని 6 మండలాల్లో 107 గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయని అధికారుల అంచనా. ఈ ఏడాది జులై నాటికి ఈ గ్రామాల్లోని మొత్తం 17,873 కుటుంబాలను ఖాళీ చేయించాలన్న ఆదేశాలు గతంలోనే వెలువడ్డాయి. అందుకు తగ్గట్టుగా పునరావాస ప్యాకేజీ అమలు కాలేదు. ప్రస్తుతం కాంటూరు స్థాయికి కాఫర్‌ డ్యాం నిర్మాణం కానందున 35 మీటర్ల ఎత్తు డ్యాంను పరిగణనలోకి తీసుకుంటే 3 మండలాల్లో 5,021 కుటుంబాలను ఖాళీ చేయించాల్సి ఉంది. ఆ మేరకూ పునరావాసం పూర్తి కాలేదు. తమకు రూ.10 లక్షల పునరావాస ప్యాకేజీ ఇస్తేనే కదులుతామని నిర్వాసితులు అంటున్నారు. ప్రస్తుతం కుటుంబానికి ఎస్సీ, ఎస్టీలైతే రూ.6.86 లక్షలు, మిగిలిన వారికి రూ.6.36 లక్షల ప్యాకేజీ అమల్లో ఉంది.

వాస్తవ చిత్రం వేరు...
గ్రామాల ముంపు విషయమై జల వనరులశాఖ, రెవెన్యూ అధికారుల అంచనాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. కుక్కునూరు మండలం లచ్చిగూడెం, కౌండిన్యముక్తి గ్రామాలు 41.15 మీటర్ల స్థాయి డ్యాం నిర్మాణంవల్ల ముంపులో చిక్కుకునే జాబితాలో లేవు. కిందటి ఏడాది ఈ గ్రామాల్లో వరద నీరు ముంచెత్తింది. వేలేరుపాడు మండలంలో పేరంటాలపల్లి, టేకుపల్లి, కాకిసినూరు ఈ జాబితాలో లేకున్నా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వేరే మండలాల్లోనూ ఇలాంటి గ్రామాలున్నాయి. ఇప్పటికీ 35 మీటర్ల ఎత్తు నిర్మాణ స్థాయి ముంపు కుటుంబాలకు పునరావాసం పూర్తి చేయలేదు. కేంద్రం నుంచి తగిన సమయంలో నిధులు రాలేదని అధికారులు చెబుతున్నారు. ఆడిట్‌ పూర్తి చేసి నివేదికలు ఇవ్వలేదని కేంద్రం అంటోంది.

ఇదీ చదవండి:

పోలవరాన్ని పూర్తి చేసేది సీఎం జగనే: ఎంపీ విజయసాయిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details