భారీ వర్షాలతో గోదావరి మహోద్ధృతంగా ప్రవహిస్తోంది. పెద్దఎత్తున వస్తున్న వరదతో ఊళ్లు, పొలాలను ఏకం చేసుకుంటూ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ ఎగువన దేవీపట్నం మండలంలోనే ఏకంగా 2 వేలకు పైగా ఇళ్లను వరద నీరు ముంచెత్తింది. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండంతో అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
భద్రాచలం వద్ద ఇప్పటికే రికార్డుస్థాయిలో నీటమట్టం పెరగడంతోపాటు....శబరి నుంచీ పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో గోదావరిలోకి 20 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే గత రికార్డులు మించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
పోలవరం స్పిల్‌వే వద్ద 30 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. కిందటేడాది 29మీటర్ల వరకు వచ్చింది. కాపర్ డ్యాం నిర్మాణంతో వరద ప్రవాహం నడక మారినట్లు భావిస్తున్నారు. 2019లో ఈ మార్పు జరిగిందని అంచనా వేస్తున్నారు. నాడు గోదారి వరదలో 15 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వచ్చింది. ధవళేశ్వరం వద్ద 10 లక్షల క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం ఉంది. అప్పుడు ముంపు గ్రామాలు సమస్యను ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం కాపర్ డ్యాం వల్ల 5 లక్షల క్యూసెక్కులకే ముంపు ముప్పు మొదలైంది. గతంలో ముంపునకు ఇప్పటి సమస్యకు చాలా తేడా ఉందని అంటున్నారు అధికారులు. దానికనుగుణంగా ప్రస్తుత వరద ప్రణాళికను రూపొందించుకుంటున్నట్లు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్‌వే పై నుంచి నీరు ప్రవహిస్తోంది. పోలవరం వద్ద గోదావరిగట్టు బలహీనంగా మారింది. దీన్ని పటిష్టం చేసేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
మహోగ్రరూపం.. గోదావరి వరద నడక మారిందా? ఇదీ చదవండి:'అప్రమత్తంగా ఉండి బాధితులను ఆదుకోవాలి'