గోదావరికి రికార్డు స్థాయిలో వరద రావడంతో గట్ల పరిస్థితి ప్రశ్నార్థకమైంది. బలహీనంగా ఉన్న గట్లకు గండ్లుపడి.. వరదనీరు గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి వరద తాకిడితో ఈ బలహీనత బయటపడింది. పోలవరం నుంచి కొవ్వూరు వరకు గట్టు కోతకు గురికావడం, తూరలు పడటంతో వరద నీరు గ్రామాల్లోకి వస్తోంది.
గత ఏడాది చిన్నపాటి వరదకే గోదావరి గట్టు ప్రమాద అంచుకు చేరుకొంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వచ్చిన వరదతో పోలవరం పరిసరాల్లో గట్లు దెబ్బతిన్నాయి. మూడు చోట్ల తూరలు ఏర్పడి వరద నీరు పాత పోలవరంలోకి ప్రవేశించింది. సుమారు 5 అడుగుల మేర నీరు నిలిచింది. ఈ తూరలు పెరిగితే.. 20 వేల జనాభా ఉన్న పోలవరం గ్రామం ఖాళీ చేయాల్సి ఉంటుంది.
అయితే.. కాస్త ఆలస్యంగా స్పందించిన అధికారులు గట్లకు తూరలు పడిన ప్రాంతాల్లో ఇసుక బస్తాలు వేయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రాళ్లు, మట్టి పోస్తున్నారు. ప్రస్తుతం పనులు చేయడానికి సైతం గోదావరి వరద అడ్డంగా వస్తోంది. వేసవిలో పనులు చేపట్టి ఉంటే.. ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని బాధితులు అంటున్నారు.
పోలవరం నుంచి దాదాపు 24 కిలోమీటర్ల మేర గోదావరి గట్లు బలహీనంగా మారాయి. ఇసుక ర్యాంపుల వద్ద గట్లను తవ్వేయడం వల్ల.. గట్లు బలహీనంగా మారుతున్నాయి. ఇసుక రవాణాకు సౌకర్యవంతంగా ఉండడానికి.. గట్లను తవ్వెస్తున్నారు. దీంతో గట్లను బలహీనంగా మారుతున్నాయి. వరద వచ్చిన సమయంలో గండ్లుపడి గోదావరి పరివాహక గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది.