పశ్చిమ గోదావరి జిల్లాలోని బియ్యపుతిప్పలో ఫిషింగ్ హార్బర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు... ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించడంతో తీర ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరినట్లయ్యింది.
నాలుగు దశాబ్దాల కోరిక...
అసెంబ్లీలో నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలకు మొదటి విడతగా రూ.142.66 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సుమారు 19 కి.మీ మేర సముద్రతీరం విస్తరించి ఉంది. మత్స్య ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ఇక్కడ తగిన ఏర్పాట్లు లేవు. దీంతో సముద్రతీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని మత్స్యకారులు నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
బియ్యపుతిప్పలో ఇప్పటికే గుర్తించిన సుమారు 800 ఎకరాల్లో రూ.350 కోట్ల అంచనాతో ఫిషింగ్ హార్బర్ నిర్మించనున్నారు. హార్బర్ నుంచి నరసాపురం వరకూ రహదారి అభివృద్ధి జరుగుతుంది. వేటసాగించి ఒడ్డుకు వచ్చిన ఇతర జిల్లాల మత్స్యకారులు సేదతీరేందుకు వసతి సమకూరుతుంది. మత్స్య ఉత్పత్తులను భద్రపరుచుకునేందుకు శీతల గదులు, చేపలు ఎండబెట్టడానికి ప్లాట్‌ఫాం, ఐస్ తయారీ పరిశ్రమ ఏర్పాటు వంటి సౌకర్యాలు చేకూరుతాయి. మత్స్య ఉత్పత్తుల విక్రయానికి ఇక్కడే మార్కెట్ సౌకర్యం కల్పించనున్నారు.
యువతకు ఉద్యోగావకాశాలు
ఈ ప్రాంతంలో మత్స్యరంగానికి అనుబంధంగా పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. నరసాపురం-సఖినేటిపల్లిల మధ్య గోదావరిపై వంతెన నిర్మాణం, వాటర్‌గ్రిడ్ పథకం ఏర్పాటుకు ప్రస్తుత బడ్జెట్‌లో నిధులు కేటాయించారని ఆయన వివరించారు.
ఇదీ చదవండి:చే'నేతన్న'లకు ఊతం... జిల్లాలో 846 మందికి లబ్ధి