పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురంలో దారుణం జరిగింది. జల్సాలకు బానిసైన ఓ వ్యక్తి మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్య, కుమారుడిపై కిరాతకంగా గొడ్డలితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన పసగడ రాంబాబుకు భార్య కుమారితో పాటు ఇద్దరు కూమారులు ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహమై..వేరు కాపురం ఉంటుండగా..చిన్న కుమారుడు అచ్చారావు పానీపూరి బండి నిర్వహిస్తూ తల్లిదండ్రులను పోషిస్తున్నాడు.
తాగుడుకు బానిసైన రాంబాబు...మద్యానికి డబ్బు కోసం నిత్యం చిన్న కుమారుడు, భార్యను వేధిస్తుండేవాడు. మంగళవారం సాయంత్రం అచ్చారావు పానీపూరి బండి వద్దకు వెళ్లిన రాంబాబు మద్యానికి డబ్బు ఇవ్వాలని కుమారుడితో ఘర్షణకు దిగాడు. అచ్చారావు ససేమిరా అనటంతో అక్కడినుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకున్న రాంబాబు రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో కుమారుడు అచ్చారావుపై గొడ్డలితో దాడి చేశాడు. అడ్డొచ్చిన భార్య కుమారిపై కూడా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.