నకిలీ వరి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని.. తమకు న్యాయం చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన రైతులు మండల వ్యవసాయ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఏడీఏ బుజ్జిబాబును కలిసి సమస్యను వివరించారు. ఈ గ్రామానికి చెందిన 30 మంది రైతులు 200 ఎకరాల్లో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన విత్తన వరి వంగడాన్ని నాటారు. ప్రస్తుతం కోతదశకు వచ్చిన పంటలో కల్తీ గింజలు(కేళీలు) రావడంతో కంపెనీ ప్రతినిధులు వాటిని కోయించారు.
తరువాత సైతం కల్తీ గింజలే వచ్చాయని.. ఈ కారణంగా దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిని విత్తన సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని.. తమకు న్యాయం చేయాలని ఏడీఏను కోరారు. ఈ మేరకు... రాఘవాపురంలో ఆ సంస్థ ప్రతినిధులతో ఏడీఏ సమావేశం నిర్వహించారు. రైతులకు న్యాయం చేయకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు.