చింతలపూడి మండలం ఎండపల్లి, రాఘవాపురం గ్రామానికి చెందిన రైతులు సుమారు 800 ఎకరాలలో 1153 రకం ధాన్యం పండించారు. వరి పంట వేసే ముందు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించగా 1153 లేక 1120 రకం విత్తనాలను పంట వేయాలని సూచించారని చెప్పారు. వారి ఆదేశాల మేరకు 1153 రకం ధాన్యం పండించామని... పంటను కోసి 20 రోజులు కావస్తున్నా అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన - West Godavari District News
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
అకాల వర్షాల వల్ల పంట తడిసి పాడవుతుందని, రాత్రి వేళల్లో పంట పొలాల్లో నిద్రిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సంచులు లేవంటూ, 1153 రకం ధాన్యం ముక్కలు అవుతుందని అధికారులు అంటున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటు రైతులు రాఘవాపురం సెంటర్లో ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని చింతలపూడి వ్యవసాయ అధికారుల దృష్టికి 'ఈటీవీభారత్' తీసుకెళ్లగా... ఆయన స్పందించి 10వేల సంచులను లారీపై గ్రామానికి పంపారు.
ఇదీ చదవండీ... కర్నూలు: ప్రైవేటు ఆసుపత్రిలో రెండు రోజుల్లో 9 మంది మృతి!