లాభసాటి వ్యవసాయానికి రైతు భరోసా కేంద్రాలు దోహదపడతాయని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందుతాయని ...వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. దళారీ వ్యవస్థ నిర్మూలన కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలో 61 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
రైతులు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేయడమే కాక... బీమా, ఎరువులు, పురుగుల మందులను నేరుగా అందించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.