ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 23, 2021, 7:36 PM IST

Updated : Jun 23, 2021, 9:01 PM IST

ETV Bharat / state

POLAVARAM: రివర్స్​ టెండరింగ్​ పేరుతో పోలవరం పనులు రద్దు: దేవినేని ఉమ

రివర్స్​ టెండరింగ్​ పేరుతో వైకాపా ప్రభుత్వం.. పోలవరం పనులు రద్దు చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని తెదేపా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా అధికారంలో ఉండగా ప్రాజెక్టు పనులు 71శాతం పూర్తయ్యాయని... వైకాపా పాలనలో ఎంత పని చేయించారని ప్రశ్నించారు.

ex minister devineni uma
మాజీ మంత్రి దేవినేని ఉమ

రివర్స్​ టెండరింగ్​ పేరుతో సీఎం జగన్​ డ్రామా ఆడి.. పోలవరం పనులు రద్దు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని తెదేపా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపాకు 151 సీట్ల బలం ఉందనే అహంకారంతోనే జగన్​ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 71 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే... జగన్​ ఎంతవరకూ నిర్మాణం చేయించారో చెప్పాలని ప్రశ్నించారు.

వంశధార, నాగావళి అనుసంధానం ఇప్పటికీ జరగలేదని, రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పురోగతి సగంలోనే ఉందన్నారు. తెదేపా హయాంలో ఎలాంటి వివాదాలు లేకుండా సమగ్ర జల విధానాలతో అన్నీ ప్రాంతాలకు నీటిని అందించామని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం అందించేందుకు నిధులు లేవనటం సరైంది కాదన్నారు. సీఎం మాటలకు చేతలకు ఉన్న తేడాను అయిదు కోట్ల ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

ముంపు గ్రామాల్లోని బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ముంపు ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే... తాడేపల్లి రాజప్రాసాదం నుంచి సీఎం ఎందుకు బయటకు రాలేదన్నారు. తెదేపా నేతలను తిట్టటానికి ఉన్న నోరు, అభివృద్ధి పనులపై మాట్లాడేందుకు లేదా అంటూ మండిపడ్డారు. రాష్ట్ర రైతులను, వారి హక్కులను కాపాడేందుకు తీసుకునే చర్యలకు సంబంధించిన ఎజెండాను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్​ చేశారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే రాజశ్రీ కోరారు.

మహిళలకు రక్షణ లేదు...

ఎస్సీ మహిళపై హత్యాచారం జరిగితే అనుమానాస్పద మృతిగా కేసు పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. కృష్ణా జిల్లా తోలుకోడులో మహిళపై నిన్న సాయంత్రం హత్యాచారం జరిగితే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లలేదన్నారు. ఆమె జారిపడి మరణించినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు. బాధిత కుటుంబానికి తక్షణమే ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:మహిళా సంరక్షణ కార్యదర్శికి పోలీస్​ డ్రెస్​..ప్రభుత్వం నిర్ణయం

Last Updated : Jun 23, 2021, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details