ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Alluri 125th Birth Anniversary: అల్లూరి 125వ జయంతి.. విగ్రహావిష్కరణ చేయనున్న ప్రధాని

మన్యం వీరుడు, విప్లవ నిప్పుకణిక అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలకు సర్వం సిద్ధమైంది . ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా విప్లవ వీరుడి గొప్పదనాన్ని భావితరాలకు తెలియజెప్పే లక్ష్యంతో ….పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేడు అల్లూరి విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి , పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అల్లూరి 125వ జయంతోత్సవ కమిటీ ఈ కార్యక్రమాలకు ఏర్పాటు చేసింది.

Alluri 125th Birth Anniversary
Alluri 125th Birth Anniversary

By

Published : Jul 4, 2022, 4:13 AM IST

విప్లవజ్యోతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన పశ్చిమ గోదావరి జిల్లాలో 125వ జయంత్యుత్సవాల ప్రారంభ వేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ.. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరిస్తారు. భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భీమవరం పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు.

అల్లూరి విగ్రహ ప్రాంగణంలో..
భీమవరం ఏఎస్‌ఆర్‌ నగర్‌లో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహంవద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. చుట్టూ ఫ్లెక్సీల్లో అల్లూరి చిత్రాలతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చిత్రాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంగణాన్ని ఆకట్టుకునే రీతిలో పుష్పవనంలా తీర్చిదిద్దారు.

వేదికపై 11 మందికే అవకాశం
ప్రధాన వేదికపై 11 మందికే అవకాశం కల్పించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు మరో ఏడుగురే ఉంటారని అధికారులు తెలిపారు. ఉదయం 10.50 నుంచి 12.30 మధ్య ప్రసంగాలుంటాయి. ఇదే ప్రాంగణం నుంచి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని వర్చువల్‌గా ఆవిష్కరిస్తారు.

* బహిరంగ సభ వేదికకు ఎదురుగా ఓ వైపు మహిళలకు, మరోవైపు పురుషులకు ప్రత్యేకంగా 500 మంది చొప్పున పట్టేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కోవైపు అయిదేసి చొప్పున భారీ స్క్రీన్లను పెట్టారు. వర్షం కురిసినా తట్టుకునేలా షామియానాలతోపాటు.. ఎండ తీవ్రత పెరిగినా ఇబ్బంది లేకుండా కూలర్లు ఏర్పాటు చేశారు. వేదిక ఎదురుగా 50వేల మందికి కుర్చీలను సిద్ధం చేశారు. అల్లూరి కుటుంబీకులు ఆసీనులయ్యేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు.

వర్షంతో ఆటంకం.. ఆగమేఘాలపై ఏర్పాట్లు

అల్లూరి జయంత్యుత్సవ సభా ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ పూర్తయినా.. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురవడంతో సభా ప్రాంగణంలో ఎక్కడిక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో అధికార యంత్రాంగం హుటాహుటిన పరిస్థితి చక్కదిద్దే చర్యలు చేపట్టింది. నిలిచిన నీటిని మోటార్లతో తోడించడంతోపాటు.. లోతట్టు ప్రాంతాల్లో మట్టి పోశారు. బహిరంగ సభ చుట్టుపక్కల ప్రాంతాలు బురదమయం అయినా సాయంత్రానికి వేదికను సుందరంగా తీర్చిదిద్దారు. రహదారులతోపాటు వాహనాలు నిలిపే ప్రాంగణాలన్నీ తీర్చిదిద్దారు.

* సోమవారం వర్షం కురిసి, ప్రధాని హెలికాప్టర్‌లో రావడానికి ఒకవేళ ఇబ్బంది ఎదురైతే... రోడ్డు మార్గంలో రావడానికి వీలుగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. నారాయణపురం నుంచి నిడమర్రు- గణపవరం- ఉండి వరకు రహదారి పెద్దపెద్ద గోతులతో అధ్వానంగా ఉంది. దీంతో ఆయా గోతుల్లో మట్టి, రాళ్లు పోసి యంత్రాలతో ఆగమేఘాలమీద చదును చేయించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.

అల్లూరి జయంతి వేడుకలకు హాజరు కానున్న సీఎం జగన్‌

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం జరిగే అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొంటారు. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి భీమవరం చేరుకుని ప్రధాని మోదీతోపాటు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.25కు భీమవరం నుంచి బయల్దేరి 1.05 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ప్రధానికి వీడ్కోలు పలికి అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి:MP RRR : ఎంపీ రఘురామ భీమవరం పర్యటన రద్దు.. కారణం అదేనా..!

POOJA HEGDE: బుట్టబొమ్మ సొగసు వల.. కుర్రకారు గుండె గిలగిల!

టీచర్​తో స్టూడెంట్​ అఫైర్​.. అలా చేయమన్నందుకు రాడ్​తో కొట్టి!

ABOUT THE AUTHOR

...view details