ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారులకు సవాలుగా మారిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు... - అధికారులకు సవాలుగా మారిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు న్యూస్

రాష్ట్రంలో ప్రారంభం కానున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో.. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల ఏర్పటు అధికారులకు సవాలుగా మారింది. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలు శిథిలావస్థతకు చేరుకున్నాయి. మరికొన్నిచోట్ల.. నాడు నేడు పనుల్లో భాగంగా నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో.. చిన్న గదిలోనే రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమయ్యారు.

Establishment of polling stations in West Godavari district has become a challenge for the authorities
అధికారులకు సవాలుగా మారిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు...

By

Published : Feb 4, 2021, 11:02 PM IST

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు గడువు ముంచుకొస్తోంది. అధికారులు ఏర్పాట్లలో నిమగ్న మయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలాచోట్ల పోలింగ్‌ కేంద్రాల ఎంపికలో లోటుపాట్లు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉంటే మరికొన్ని నాడు-నేడు పనుల్లో భాగంగా నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో చిన్న గదిలోనే రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇలా అనేక రకాల సమస్యలు అధికారులకు సవాలు విసురుతున్నాయి.

సౌకర్యాల కొరత:

పల్లెపోరులో ప్రతి వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రం తప్పనిసరి. ఓటర్లు పెరిగితే అదనపు కేంద్రాలు అవసరం. కేంద్రాల్లో వసతులపై దృష్టిపెట్టాలి. కేంద్రాల్లో విద్యుత్తు, తాగనీరు, మరుగుదొడ్లు, వృద్ధులకు, దివ్యాంగులకు ర్యాంపులు ఉండాలి. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నాడు-నేడు పనులు తుది దశకు వచ్చినా ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. పాలకొల్లు పరిధిలోని లంకలకోడేరు పాఠశాలలో చివరి దశకు వచ్చాయి. మరుగుదొడ్లకు వెళ్లేందుకు దారి సక్రమంగా లేదు. ఆకివీడు మండలం చెరుకుపల్లిలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలల్లో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పెచ్చులు ఊడి ఇనుప చువ్వలు బయటికి దర్శనమిస్తున్నాయి. ఇక్కడ విద్యుత్తు సౌకర్యం ఉన్నప్పటికీ ఫ్యాన్లు మరమ్మతులకు గురయ్యాయి. ర్యాంపు సౌకర్యం కూడా లేదు. దీంతో ఓటర్లు ఇక్కడకు రావాలంటే జంకుతున్నారు.

అధికారులకు సవాలుగా మారిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు...

పోలింగ్‌ కేంద్ర ఎంపికపై విమర్శలు..

కొన్ని చోట్ల ఒకే గది రెండు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇలా చాలా పోలింగ్‌ కేంద్రాల్లో ఎదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. వేలాది పోలింగ్‌ కేంద్రాల అవసరం ఉండటంతో చాలా చోట్ల అధికారులు నామమాత్రంగా ఉన్న కేంద్రాలను సైతం ఎంపిక చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కొలిక్కిరాని పనులతో కొన్ని చోట్ల ఇక్కట్లు..

ఆకివీడు మండలం తరటావ పరిధిలో పోలింగ్‌ కేంద్రంగా ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో నాడు-నేడు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇంకా మరుగుదొడ్ల నిర్మాణం, మార్గం, ర్యాంపు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎన్నికలకు మరో వారం కూడా వ్యవధిలేని నేపథ్యంలో ఈ కేంద్రం అప్పటికి పూర్తిస్థాయిలో సిద్ధం కాదని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

పరిష్కరిస్తాం:

వసతుల సమస్య నా దృష్టికి వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాను. లోటుపాట్లు ఉంటే పరిష్కరిస్తాం. కేంద్రాల్లో సిబ్బందికి, ఓటర్లకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాం. విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు ఉండేలే ఏర్పాట్లు చేస్తాం’ అని జిల్లా పంచాయతీ అధికారి కె.రమేష్‌బాబు తెలిపారు.

పెచ్చులూడిన స్లాబ్​లు.. దర్శనమిస్తున్న ఇనుప చువ్వలు..

ఆకివీడు మండలం మందపాడు ప్రాథమిక పాఠశాలను పేరుకు కేంద్రం ఏర్పాటు చేశామని స్థానిక అధికారులు చెబుతున్నా సౌకర్యాలు మాత్రం కనిపించటం లేదు. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఇందులో పాఠశాల కూడా నిర్వహించటం లేదు. వృద్ధులు, దివ్యాంగులు కేంద్రంలో ప్రవేశించేందుకు ర్యాంపు కూడా లేదు. విద్యుత్తు సౌకర్యం ఉన్నప్పటికీ ఫ్యాన్లు మాత్రం తిరగటం లేదు. శ్లాబ్‌ పెచ్చులు ఊడి ఇనుప చువ్వలు దర్శనమిస్తున్నాయి. గోడల్లో నుంచి చెట్లు బయటికి కనిపిస్తున్నాయి.

అధికారులకు సవాలుగా మారిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు...

పెనుమంచిలి వర్థనపుగరువులో పోలింగ్‌ కేంద్రం..

ఆచంట మండలం పెనుమంచిలి పంచాయతీ పరిధిలో ఉన్న వర్థనపుగరువు ప్రాథమిక పాఠశాల భవనంలో ఒకే గది ఉంది. ఇక్కడ రెండు పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 500 మంది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్‌ జరిగే గదిలోకి వెళ్లేందుకు ర్యాంపు బాట సౌకర్యం కూడా లేదు. కరోనా నేపథ్యంలో ఒకే గదిలో ఇంత మంది ఓటర్లు ఓటు వేయాలంటే భయంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఎన్నికలు నిర్వహించే పంచాయతీలు: 893

వార్డుల సంఖ్య: 9660

పోలింగ్‌ కేంద్రాల సంఖ్య: 9991

ఇదీ చదవండి:

నేటికి ఆదర్శం... ఆ గ్రామాలు

ABOUT THE AUTHOR

...view details