పురాతన వస్తువులు ఇంట్లో ఉంటే కోట్లు వస్తాయని నమ్మించి మోసం చేసే ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పలూరుకు చెందిన వెంకట సుబ్బారావు పుట్టుకతోనే దివ్యాంగుడు. ఇతను గోపి, చక్రపాణిలతో కలిసి.. పాత నాణేలు, రంగు రాళ్లకు అపారమైన మహిమలు ఉంటాయని అమాయకులను నమ్మించి వారి నుంచి డబ్బులు వసూలు చేసేవారు. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన ఒక నల్లని లక్క ముక్కకు అశేష మహిమలు ఉన్నాయని... ఒక డెమో వీడియో సృష్టించారు.
ఈ క్రమంలో ఏలూరులో ఓ వ్యక్తికి లక్కరాయిని అమ్మాలని తన తోటివారిని తీసుకువస్తుండగా.. పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. కొనుక్కున్నవారు ఎవరైనా ఎదురు తిరిగితే.. డమ్మీ తుపాకీతో బెదిరించేవాడని ఏలూరు డీఎస్పీ దిలీప్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఒక డమ్మీ తూపాకి, రూ.20 వేలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.