కృష్ణ జిల్లా నూజివీడు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన సరోజిని.. పశ్చిమ గోదావరిజిల్లా పెదపాడు మండలం ఏపూరులో వ్యవసాయం చేస్తున్నారు. పొలాన్ని కౌలుకు తీసుకొని.. వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 80 ఏళ్ల వయసులోనూ సేంద్రియ సాగుపై మక్కువతో.. సొంత పొలం లేకపోయినా.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కుమారుడు, మనవడు, మనవరాలు సాయంతో ప్రకృతి సేద్యాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. సరోజిని సేద్యపు పద్ధతులు గమనించిన పశ్చిమగోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు...తమ విభాగంలో ప్రచారకర్తగా చేరి.. రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా రాష్ట్రమంతటా పర్యటిస్తూ .. సేంద్రియ సేద్యంపై సరోజిని ప్రచారం చేస్తున్నారు. రైతు సదస్సుల్లో పాల్గొంటూ ప్రకృతి సేద్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
అంతర పంటలుగా కూరగాయలు...
వయసు మీదపడుతున్నా.. కుటుంబసభ్యుల సాయంతో ఓ వైపు సేంద్రియ సాగు చేస్తూ... మరోవైపు రైతుల్లో సరోజిని అవగాహన కల్పిస్తున్నారు. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన సేంద్రియసాగును కొనసాగిస్తానని ఆమె చెబుతున్నారు. ఏపూరులో కౌలుకు చేస్తున్న బామ్మ... జామ తోటలో అంతర పంటలుగా కూరగాయాలు సాగుచేస్తున్నారు. వరి, వేరుశనగ వంటి పంటలు సాగుచేస్తూ.. సేంద్రియ వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
సొంత పొలం ఉన్న వారే సేంద్రియ సేద్యం చేసేందుకు ధైర్యం చేయరు.. అలాంటిది కౌలుపొలంలో ప్రకృతి సేద్యాన్ని అద్భుతంగా చేస్తోంది సరోజిని బామ్మ. పంటల దిగుబడి ఆలస్యంగా వస్తుందన్న కారణంతో కౌలుదారులు ప్రకృతి సేద్యం చేయడానికి వెనకాడతారు. కానీ ఈమె కౌలుకు చేస్తూనే అధిక దిగుబడులు సాధిస్తుంది.