పశ్చిమ గోదావరి జిల్లా పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో అధిక ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం ఆలయంలో వైశాఖ, ఆశ్వయుజ మాసాలలో ఏడాదికి రెండు సార్లు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అయితే ఈసారి అధికమాసం వచ్చిన కారణంగా.. మూడు సార్లు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. కరోనా నియంత్రణ నేపథ్యంలో ఈసారి వేడుకలను నిరాడంబరంగా, ఏకాంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు స్వామి, అమ్మవార్లను ఆలయ అర్చకులు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేశారు. 27న రాత్రి కళ్యాణోత్సవాల వీక్షణకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ధ్వజారోహణ, 29న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 30వ తేదీ రాత్రి 9 గంకు ఆలయ అంతరాలయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణమహోత్సం నిర్వహించనున్నారు. వచ్చేనెల 2న ధ్వజావరోహణ, 3న రాత్రి శ్రీ పుష్ప యాగంతో ఉత్సవాలు ముగుస్తాయి.