పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా తయారు చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ముఖమంటపంలో ప్రత్యేక మంటపాన్ని ఏర్పాటు చేసి పచ్చని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. మంగళవాయిద్యాల నడుమ వేద మంత్రాలు చదువుతుండగా... స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చేశారు. ఈ ఆధ్యాత్మికత ఘట్టాన్ని తిలకించి భక్త కోటి పులకించింది. ఉత్సవాల సందర్భంగా స్వామివారు రోజుకో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు శ్రీవారు.. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమన్నారాయణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రికి గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఘనంగా ద్వారకా తిరుమలేశుని కల్యాణ మహోత్సవాలు - west godavari
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి తిరుకల్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ద్వారకా తిరుమల