పశ్చిమగోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో తమ సమర్థతను చాటుతున్నాయి.. స్వయం సహాయ సంఘాలు. ఐదేళ్లుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 2015 నుంచి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొన్నింటి నిర్వహణ బాధ్యతను స్వయం సహాయ మహిళా సంఘాలకు అప్పగించారు. జిల్లాలో రబీ, ఖరీఫ్‌లో పండిన ధాన్యాన్ని ఈ కేంద్రాల ద్వారా మహిళలు కొనుగోలు చేయాలి. ప్రతి కేంద్రానికి ఆరు మంది మహిళలతో కమిటీ వేశారు. ఒకరు ధాన్యంలో తేమశాతం చూడటం, మరొకరు సంచులు, నగదు... ఇలా ప్రతిఒక్కరు ఒక బాధ్యత చేపట్టి కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
అతివలు... కోట్ల రూపాయల వ్యాపారాన్ని నడుపుతున్నారు - ధాన్యం కొనుగులు కేంద్రాలను నడుపుతున్న మహిళలు
అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని డ్వాక్రా సంఘాల మహిళలు. ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యతలు చేపట్టి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అటు అన్నదాతకు మేలు చేయడమే కాకుండా... ఇటు తమ సంఘాల ఆర్థిక పరిపుష్టికి తోడ్పాటు అందిస్తున్నారు.

రైతులకు సాయంగా
స్వయం సహాయ సంఘాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాక.. దళారీలు మాయమయ్యారు. మద్దతు ధర దక్కడమే కాకుండా.. 24 గంటల్లోనే రైతుల చేతికి నగదు అందుతోంది. ఈ కేంద్రాల నిర్వహణ వల్ల మహిళా సంఘాలకు ప్రభుత్వం కమీషన్‌ను అందిస్తోంది. ప్రతి క్వింటాలుకు 35రూపాయల చొప్పున కమీషన్ చెల్లిస్తోంది. 2015లో 12.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. 2016లో ఎనిమిదన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. 2017లో ఏడున్నర లక్షలు, 2018లో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కమీషన్ రూపంలో వచ్చిన ఆదాయాన్ని మహిళాసంఘాల ఆర్థిక బలోపేతానికి వినియోగిస్తున్నారు. ఆయా గ్రామ మహిళా సమాఖ్య భవనాలను ఈ డబ్బుతో నిర్మిస్తున్నారు. మిగిలిన నగదును ఆయా గ్రూపులకు ఆర్థికసాయంగా అందిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న పలువురు మహిళల్లో నిరక్షరాస్యులూ ఉన్నారు. అయినప్పటికీ వ్యాపార దక్షతతో ధాన్యం కొనుగోలును విజయంపథంలో నడిపిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
ఇదీ చదవండి