పశ్చిమగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్ర స్థాయికి చేరింది. అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో సరఫరా నిలిచిపోయిందని ప్రజలు అంటున్నారు. శివారు ప్రాంతాల ప్రజల నీటి ఇక్కట్లు వర్ణనాతీతంగా మారింది. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. వచ్చే ఏడాదైనా సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నేతలు, అధికారుల దృష్టి సారించకే సమస్య..
గోదావరి, కృష్ణా, కొల్లేరు జలాలు సమృద్ధిగా లభ్యమయ్యే పశ్చిమగోదావరి జిల్లాలోనూ వేసవి నీటి కష్టాలు మొదలయ్యాయి. చుట్టూ నీరున్నా.. సరిగ్గా ఉపయోగించుకోవాలనే తపన నేతలకు, అధికారులకు లేకపోవడం వల్లే సమస్య తలెత్తిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నిధుల విడుదలలో జాప్యం, పర్యవేక్షణా లోపం, అధికారుల అలసత్వమే ప్రస్తుత దుస్థితికి కారణమని చెబుతున్నారు. ఇప్పుడు తీవ్ర నీటిఎద్దడి ఉన్న ప్రాంతాలన్నీ.. గతంలోనూ సమస్యను ఎదుర్కొన్నవేనంటున్నారు. కనీసం తాగడానికైనా నీరు సరఫరాకు ఏర్పాట్లు చేయాలంటూ.. ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కానీ పరిష్కారంపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. ఆ నిర్లక్ష్యమే పట్టణాలు, పల్లె ప్రాంతాల్లో నీటి సమస్య పెరగడానికి కారణమైంది.
వారానికి రెండుసార్లే నీటి సరఫరా..
జిల్లాలోని 48 మండలాల పరిధిలో ఉన్న 908 పంచాయతీల్లో నీటి సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శీతాకాలంలోనే సరఫరా సరిగ్గా లేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాల్లో.. వేసవి ఆరంభం నుంచి ఎద్దడి మరింత తీవ్రమైంది. డెల్టా ప్రాంతంలోని భీమవరం, ఉండి, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లోనూ ప్రజలు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు. ఏలూరు నగరపాలక సంస్థ, ఏడు పురపాలికలు, రెండు నగర పంచాయితీల్లోనూ తాగునీటి కటకట ఏర్పడింది. పట్టణ ప్రాంతాల్లో రెండు రోజులకోసారి నీళ్లు సరఫరా చేసేవారు. ప్రస్తుతం నాలుగురోజులైనా నీరు రావట్లేదని, గ్రామీణ ప్రాంతాల్లోనూ మూడు రోజులకోసారి వదులుతున్నారని ప్రజలు వాపోతున్నారు.