Drinking Water Problems in West Godavari District:ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన సీఎం జగన్ ప్రజలపై అనేక హామీలు గుప్పించారు. అధికారంలోకి వస్తే వెంటనే నెరవేర్చేస్తానన్నట్లు రాష్ట్ర ప్రజలను నమ్మించారు. ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి రోజులు కాదు.. ఏళ్లు గడిచింది. అయినా హామీలు నెరవేరకపోయేసరికి.. జగన్ నటన ఎదుట విలక్షణ నటులు కూడా ఏమాత్రం సరిపోరని ప్రజలకు అర్థమవుతోంది. దీనికి ఉదాహరణే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మురుగునీటి కాలువలను శుద్ధి చేసి.. ఊరురా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్న ఆయన హామీ నీటిమూటగానే మిగిలిపోయింది.
2018 మే నెలలో ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేస్తూ.. ఢంకా బజాయించి మరీ జగన్ మాటలు చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. అప్పుడు కలుషిత నీటిని తాగలేకపోతున్నామని.. స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అక్కడి ప్రజలు తమ సమస్యలను జగన్‌కు వినిపించారు. జగన్ సీఎం అయ్యి నాలుగున్నరేళ్లు అవుతోంది. ఆయన ఇచ్చిన మాట నెరవేరుతుందని, తాగునీటి కష్టాలు తీరతాయని.. ఇన్నాళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆయా గ్రామాల ప్రజల తాగునీటి వెతలతో మాకేంటి సంబంధం అన్న రీతిలో వైసీపీ ప్రభుత్వ ధోరణి ఉంది.
పంట కాలువల్లోని నీరే ఆధారం: ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు, కాళ్ల, ఉండి, పాలకోడేరు మండలాల్లో 70 గ్రామాలు ఉన్నాయి. సుమారు 2లక్షల 75 వేల మంది జనాభా ఉండగా.. వీరందరికీ వెంకయ్యవయ్యేరు, పాతవయ్యేరు, ఉండి పంట కాలువల్లోని నీరే ఆధారం. కాలువల పక్కన ఎక్కడా కొత్తగా సమ్మర్ స్టోరేజే ట్యాంకులు నిర్మించలేదు. 14 గ్రామాల్లో పాత ట్యాంకుల్లో పూడికతీత పనులూ చేపట్టలేదు.
గుమ్ములూరు, సీసలి, జక్కరం గ్రామాల్లో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు తవ్వారు. కోలనపల్లిలో ఓహెచ్ఆర్ నిర్మించారు. జేజీఎంలో పైపులైన్ల విస్తరణ పనులు ఏడెనిమిది చోట్ల మొదలుపెట్టారంతే. ఉండి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉప కాలువల ద్వారా రక్షిత పథకాల చెరువులకు నీరు వస్తుండగా.. అలా వస్తున్న జలాలన్నీ పూర్తిగా కలుషితమవుతున్నాయి.
కలుషితమవుతున్న సాగు, తాగునీరు: సాగు, తాగు నీరు అందించే పంట కాలువల్లోకి మురుగు వ్యర్థాలు, ఆక్వా చెరువులు, డ్రెయిన్లలోని నీరు నేరుగా వచ్చి చేరుతోంది. వెంకయ్య వయ్యేరు, పాత వయ్యేరు, ఉండి ప్రధాన పంట కాలువల్లో.. వ్యర్థాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని పర్యావరణ నిపుణులు గుర్తించారు. 2010-2015 మధ్యలో భీమవరంలోని నీటిని పరీక్షించి వివిధ బ్యాక్టీరియా రకాలు ఉన్నాయని తేల్చారు. ఈ నీటిని తాగితే అనేక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. కానీ ఇదే నీటిని చెరువులకు తీసుకొచ్చి.. అరకొరగా శుద్ధి చేసి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు.