పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో ప్రజలు కరోనాను మించి.. కలరా భయంతో ఆందోళన చెందుతున్నారు. తమకు సరఫరా అయ్యే నీరు కలుషితమై ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు కానీ...నీటిని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న చెరువులో తూడు, గుర్రపుడెక్క పెరిగిన కారణంగా నీరు దుర్వాసన వస్తోందని ప్రజలంటున్నారు.
దీనితో ఆ నీటిని తాగలేక ప్రజలు సతమతమవుతున్నారు. గడచిన 15 రోజుల నుంచి ఇదే విధంగా నీరు సరఫరా అవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగేందుకు నీటిని కూడా సరిగా సరఫరా చేయడం లేదని వాపోతున్నారు. కుళాయిలు వచ్చినా మోటార్లు వేయడంతో చాలామంది తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.