నాడు-నేడు, విద్యా దీవెన, విద్యా కానుక, అమ్మఒడి ఇలా ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. క్షేత్రస్థాయి సమస్యలను మాత్రం పెడచెవిన పెడుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలా పాఠశాలల్లో కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితులున్నాయి. కొన్ని చోట్ల విద్యార్థులే ఇంటి నుంచి సీసాల్లో నీరు తెచ్చుకుంటుంటే..మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే జేబులో డబ్బులతో నీరు తెప్పిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, అధికారుల నుంచి దిద్దుబాటు చర్యలు కనిపించని వైనమిది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలను ‘న్యూస్‌టుడే’ బృందం సందర్శించి పరిశీలించగా అనేక సమస్యలు వెలుగు చూశాయి.
కుండలో నీరు పోసి పెట్టినా..
అన్ని ప్రభుత్వ బడుల్లో తాగునీటి వసతి ఉందని అధికారిక గణాంకాల్లో పొందుపరిచారు. గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలకు చెందిన కుళాయిలు, బోర్లు, చేతి పంపులు, బావులు, ఆర్‌వో ప్లాంట్లతో పాటు బయటి నుంచి తెచ్చే తాగునీటి టిన్నులను పాఠశాలల్లో ఏర్పాటు చేసినా విద్యార్థులకు శుభ్రతతో కూడిన తాగునీరు అందిస్తున్నట్లేనని అధికారులు అంటున్నారు. మరో విచిత్రమేమిటంటే.. కుండలో పోసి పెట్టినా తాగునీటిని ఏర్పాటు చేసినట్లే అవుతుందని చెబుతున్నారు. నాడు-నేడులో ఎంపికైన పాఠశాలలకు సంబంధించిన తాగునీటి వివరాలు తప్ప ఏ పాఠశాలలో ఎటువంటి వసతిని ఏర్పాటుచేశారనే గణాంకాలు సమగ్ర శిక్షా కార్యాలయంలో లేవు. అన్ని పాఠశాలల్లో తాగునీటి సదుపాయం ఉన్నట్లేనని గణాంకాల్లో పేర్కొన్నారు.
పెనుగొండ మండలం ములపర్రు శివారు సీతరాముని చెరువు పాఠశాల విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న నీటి సీసాలు
వీరవాసరం మండలం కొణితివాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు రూ.7 లక్షలతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రం మరమ్మతులకు గురైంది. ప్రస్తుతం పాత యంత్రాన్ని ఉపయోగించి విద్యార్థులకు తాగునీరు అందిస్తున్నారు. మరమ్మతులపై సంబంధింత సంస్థ ప్రతినిధులు స్పందించలేదని ప్రధానోపాధ్యాయుడు దాసరి శ్రీనివాసరావు తెలిపారు.
పర్యవేక్షిస్తున్నాం :పాఠశాలల్లో తాగునీటి వసతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సమగ్ర శిక్షా డీపీసీ గంగాభవాని తెలిపారు. నాడు-నేడు కింద అభివృద్ధి చేసిన పాఠశాలల్లో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్లు మరమ్మతుకు గురైతే ప్రధానోపాధ్యాయుడు ఆన్‌లైన్ ద్వారా లాగిన్‌లో సమస్యను తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఆ విధంగా తెలిపే సమస్య పరిష్కారానికి సాంకేతిక నిపుణుడిని పాఠశాలకు పంపేందుకు ఏపీడబ్ల్యూఐడీసీ యాజమాన్యం చర్యలు చేపడుతుందని తెలిపారు.