Domakonda Fort: 15వ శతాబ్దం చివరి నుంచి 20వ శతాబ్దం వరకు దోమకొండ సంస్థానం హిందూ సంస్కృతితో విరాజిల్లింది. బ్రహ్మనీ సుల్తాన్ పిలుపుతో భిక్కనూరును రాజధానిగా చేసుకుని కామినేని వంశీయుడైన కామిరెడ్డి పరిపాలించారు. తర్వాత రామారెడ్డి, దోమకొండ రాజధానులుగా కొనసాగాయి. సోమేశ్వర్రావు హయాంలో 1948 సెప్టెంబరు 17న దోమకొండ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. వారసుల్లో ఒకరైన ఉమాపతిరావు ఐఎస్గా పని చేశారు. ఆయన కుమారుడు అనిల్ కుమార్.. ఆపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి కూతురు శోభనను వివాహం చేసుకున్నారు.
యునెస్కో అవార్డు: వీరి కూతురు ఉపాసన సినీనటుడు చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ నిశ్చితార్ధం, పెళ్లి వేడుక సందర్భంగా దోమకొండ గడీకోట ప్రాచుర్యంలోకి వచ్చింది. 2022 సంవత్సరానికి గాను ఆసియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డు కోసం వివిధ దేశాల నుంచి మొత్తం 387 ప్రతిపాదనలు వచ్చాయి. అందులో ఆరు దేశాలకు చెందిన 13 ప్రాజెక్టులను యునెస్కో ఎంపిక చేసింది. దోమకొండ కోట ప్రైవేట్ నిర్మాణమైనప్పటికి సాంస్కృతిక స్థలంగా పునరుద్ధరించినందున యునెస్కో అవార్డుకు ఎన్నికైనట్లు దోమకొండ కోట ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు.
17వ శతాబ్దంలో నిర్మాణం: కోట సుమారు 39 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఉంది. రాజాసోమేశ్వర్రావు 17వ శతాబ్దంలో గడీకోట నిర్మాణాన్ని ప్రారంభించారు. కుడ్యాలు, ప్రాకారాలు శిల్పకళా నైపుణ్యంతో ఉట్టిపడతాయి. అద్దాల బంగ్లా, రాజమహల్ భవనాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాజస్థాన్, జోద్‌పూర్ కళాకారులతో దుర్గాలు, ప్రాకారాలు నిర్మించినట్లు చెబుతారు. శివ, వైష్ణవులకు ప్రాధాన్యమిస్తూ ముఖ్యకేంద్రాల్లో శివాలయాలు, రామ మందిరాలు నిర్మించారు.