కార్తీక మాసం ప్రారంభం మొదటి సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం పూజలు విశేషంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గతంతో పోలిస్తే భక్తుల సంఖ్య తగ్గింది. పోలీసులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వేంచేసి ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. త్రేతా యుగం నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహిళలు స్వామివారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేసి... ధ్వజస్తంభానికి పూజలు చేశారు. కొవిడ్ కారణంగా దేవస్థానం అధికారులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.