పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 47 గోవులను పట్టుకుని చింతలపూడి పోలీసు స్టేషన్కు తరలించినట్లు భాజపా నాయకులు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఏలూరు మీదుగా హైదరాబాద్కు గోవులను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు వద్ద పోలీసులు నిఘా పెట్టారు. దీంతో చింతలపూడి మండలం లింగగూడెం సమీపంలో ఓ వ్యాన్ రావడంతో అనుమానం వచ్చి పరిశీలించారు. అందులో నాలుగు కాళ్లను తాళ్ళతో బంధించి అతి క్రూరంగా తరలిస్తున్న 47 గోవులను గుర్తించారు. వాటిని తరలించేందుకు వ్యాన్ వెనుక భాగంలో రెండు అరలుగా తయారు చేసి గోవులు కదలకుండా కాళ్లు బంధించి ఒకదానిమీద ఒకటి ఉండే విధంగా గోవులను వ్యానులో ఎక్కించారు.
గోవులు పడే అవస్థలు చూసిన భాజపా నాయకులు దేవతకు సమానమైన గోవులను అతి దారుణంగా తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వ్యాన్, గోవులను పోలీసు స్టేషన్కు తరలించారు. గోవులను గోశాలకు తరలించి.... వ్యాన్ స్వాధీనం చేసుకుని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.