పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం భీమవరంలో అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. అంబులెన్స్ లేదన్న కారణంగా అస్వస్థతకు గురైన ఓ వ్యక్తిని గ్రామ పంచాయతీకి చెందిన చెత్త వేసే రిక్షాలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
దారుణం... చెత్త బండిలో కరోనా అనుమానితుడి తరలింపు - భీమవరం కరోనా తాజా వార్తలు
భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. కరోనా అనుమానితుడిని మున్సిపాలిటీకి చెందిన చెత్త వేసే రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లారు అధికారులు. తన సొంతూళ్లో జరిగిన ఈ ఘటనకు సిగ్గుతో తలదించుకుంటున్నానని ఎంపీ రఘరామకృష్ణరాజు అన్నారు
విజయవాడ చెందిన సతీశ్ కుమార్ అనే వ్యక్తి భీమవరం బస్టాండ్‌లో రెండు రోజులుగా సొమ్మసిల్లి పడి ఉన్నాడు. అతనికి కరోనా సోకి ఉంటుందన్న అనుమానంతో స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. స్థానిక అధికారులకు సైతం సమాచారం అందించారు. అయితే 108 సకాలంలో రాకపోవటంతో గ్రామ పంచాయతీకి చెందిన చెత్తరిక్షాలో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు స్థానిక అధికారులు. కొవిడ్ పరీక్ష కోసం ఏలూరు పంపడానికి ప్రయత్నిస్తుండగా...అక్కడి నుంచి సతీష్ కుమార్ పరారయ్యాడు. అతిగా మద్యం సేవించడం వల్లే సతీశ్ కుమార్ అస్వస్థతకు గురైనట్లు పోలీసులు పేర్కొంటున్నారు. సకాలంలో ఆంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన చెత్తరిక్షాలో ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. కాగా ఈ ఘటనపై ఎంపీ రఘరామకృష్ణరాజు స్పందించారు.
చెత్త వేసే మున్సిపాలిటీ బండిలో కరోనా బాధితుడిని తీసుకువెళ్లడం బాధాకరం. నా సొంతూళ్లో జరిగిన ఈ ఘటనకు సిగ్గుతో తలదించుకుంటున్నా. సీఎం జగన్ అట్టహాసంగా వెయ్యికి పైగా అంబులెన్సులు ప్రారంభించినా... అవి అవసరానికి ఉపయోగపడలేదు. ప్రజలు నన్ను క్షమించాలి. ప్రారంభించిన అంబులెన్సులు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళుతుందని భావిస్తున్నా- రఘురామకృష్ణ రాజు, నర్సాపురం ఎంపీ